హైదరాబాద్ : పోలీసులు ఊహించని రీతిలో బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటున్న విద్యార్థులను వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హల్ చల్ చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌పై స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ), చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇక్ఫై , ఐబీఎస్ కాలేజీలకు చెందిన మొత్తం 108 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిలో 71 మంది అబ్బాయిలు, 37 మంది అమ్మాయిలు ఉన్నారు.
అలాగే ఘటనా స్థలం నుంచి 15 గ్రాముల గంజాయి, మద్యం, 7 కార్లు, 3 బైక్‌లు, 70 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈవెంట్ నిర్వహించిన వ్యక్తిని మన్నన్‌గా గుర్తించినట్లు సమాచారం. పార్టీకి వచ్చిన ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు వసూలు చేశాడని, చివరి నిమిషంలో పార్టీ వేదిక వివరాలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. నిర్వాహకుడితో సహా ముగ్గురికి గంజాయి పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు వెల్లడైంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి హైదరాబాద్ గంజాయి, మత్తు పదార్థాలకు, నేరాలకు , హత్యలకు కేరాఫ్ గా మారి పోయింది. దేశంలోనే అత్యధిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నగరాలలో హైదరాబాద్ కూడా ఉండడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఫామ్ హౌస్ లు, పబ్ కల్చర్, యువతీ యువకులు పక్కదారి పట్టడం పేరెంట్స్ ను ఇబ్బందులకు గురి చేస్తోంది.
