పంటలు వేయొద్ద‌న్న‌ ముఖ్యమంత్రి అధికారంలో ఉండొద్దు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు

ఆదిలాబాద్ జిల్లా : పంట‌లు వేయొద్ద‌ని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ ప‌ద‌విలో కొన‌సాగేందుకు అర్హుడు కాద‌ని, త‌క్ష‌ణ‌మే దిగి పోవాల‌ని డిమాండ్ చేశారు తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్ర‌వెల్లిలో పాంచ‌జ‌న్య సంక‌ల్ప స‌భ నిర్వ‌హించారు. ఆదిలాబాద్ జిల్లా ఆశీర్వాదం మీ దీవెనల కోసమే వచ్చాం అన్నారు. ఈ జిల్లాలో ఎకరం నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్.. ఏ మొఖం పెట్టుకోని ఇక్కడ గర్జన సభ పెడుతుంది? అని ప్ర‌శ్నించారు. చనఖా – కొరటా ప్రాజెక్ట్ ను 368 కోట్ల నుంచి రూ. 2100 కోట్ల పెంచి భారీ అవినీతి చేశారని ఆరోపించారు. ఈ సొమ్ము గుంటనక్క మింగిందా? బీఆర్ఎస్ ఖాతాలో చేరిందా సమాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సామాజిక న్యాయమని మాట్లాడటం కాదు చేతల్లో చేసి చూపిస్తున్నాం అన్నారు కల్వ‌కుంట్ల క‌విత‌. రెండు ఎమ్మెల్సీ సీట్లకు బీసీలనే అభ్యర్థులుగా ప్రకటించి రాజకీయాల్లో మార్పు తెచ్చే పనిచేస్తున్నాం అన్నారు.

విప్లవానికే వన్నె తెచ్చిన ఇంద్రవెల్లి పుణ్యభూమికి పాదాభివందనం తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఈ ప్రాంత మహానీయులు రామ్ జీ గొండు, వన్నెల ఎల్లన్న, వెడమ రాము ల‌ను గుర్తు చేసుకుంటూ మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తున్నాం అని తెలిపారు. జల్, జమీన్, జంగల్ అంటూ పోరాటం చేసిన కొమురం భీమ్ చ‌రిత్ర ఉన్నంత కాలం బ‌తికే ఉంటాడ‌ని అన్నారు. ఆనాడు తమ పంటను దోచుకుంటున్న వాళ్ల నుంచి కాపాడు కునేందుకు ఆదివాసీలు మీటింగ్ పెట్టుకోవాలని చూస్తే మీటింగ్ వచ్చే వారిని పొట్టన బెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదివాసీలను పిట్టలను కాల్చినట్లు కాల్చిన పాపం కాంగ్రెస్ దే. ఆ దుఖ్ఖానికి సంబంధించి స్థూపం ఇక్కడే ఉందన్నారు. అయినా సరే కాంగ్రెస్ వాళ్లు ఇక్కడకు వచ్చి క్షమాపణ అడిగితే నాలుగు సీట్లు ఇచ్చిన గొప్ప మనసు ఇక్కడి ఆదివాసులదని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి వీరులకు రూ. 25 లక్షలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించు కోలేద‌ని మండిప‌డ్డారు.

Leave A Reply

Your Email Id will not be published!