వాషింగ్టన్ : ఎన్ విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌కు చైనా గూఢచారితో సంబంధం ఉందేమోనని విచారణ చేపట్టనున్నారు. అమెరికా విధానకర్తల కథనం ప్రకారం సదరు మహిళను చైనాకు చెందిన ‘మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ’ సంస్థ సదరు సీఈఓపై గూఢచర్యం చేసేందుకు నియమించి ఉండవచ్చని ఆరోపణలు ఉన్నాయి. సింగపూర్ కేంద్రంగా పనిచేసే చిప్ కంపెనీకి చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్‌తో తనకు సంబంధం ఉందని జెన్సెన్ హువాంగ్ అంగీకరించిన నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచార కార్యకలాపాలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఎన్ విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు స్వతంత్ర విచారణను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా జాతీయ భద్రత , ఆర్థిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇవి దాని వాటాదారుల ప్రయోజనాలకు చాలా కీలకమని కంపెనీ పేర్కొంది.
జాతీయ భద్రతకు లేదా ఎన్ విడియా రహస్యాలకు ఎటువంటి భంగం కలిగిందని భావించడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, అందుబాటులో ఉన్న సమాచారమంతటినీ పరిశీలిస్తామని బోర్డు తెలిపింది. ఈ విచారణకు జెన్సెన్ పూర్తి మద్దతు ఇస్తున్నారని, సహకరించేందుకు అంగీకరించారు. జెన్సెన్ , ఆయన నాయకత్వ బృందంపై బోర్డుకు పూర్తి నమ్మకం ఉంది. తగిన సమయంలో మరిన్ని వివరాలను వెల్లడిస్తాం అని బోర్డు పేర్కొంది. జెన్సెన్ హువాంగ్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో తన కుటుంబానికి , ఉద్యోగులందరికీ క్షమాపణలు కోరారు. నేను నా భార్యకు ద్రోహం చేశాను. నా చర్యలు ఆమెను, మా పిల్లలను బాధించాయి. నేను చేసిన దానికి ఎలాంటి సాకు లేదు. నేను చాలా చింతిస్తున్నాను. నా జీవితాంతం, నా కుటుంబం నాకు ప్రేమను, మద్దతును ఇచ్చింది. వారు నా నిజాయితీకి, విధేయతకు అర్హులు. దానికి బదులుగా, నేను వారిని నిరాశపరిచాను అని పేర్కొన్నారు.