దేశీయ నగదు బదిలీలపై ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న

బ్యాంకుల‌కు స‌మ‌గ్ర మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది

ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. దేశీయ న‌గ‌దు బ‌దిలీల‌పై సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా నెఫ్ట్ ద్వారా నగదు బదిలీ చేసే పరిమితిని రూ. 50,000గా యథాతథంగా కొనసాగించింది. ఏదైనా ఖాతాలో లేదా ఖాతాల సమూహంలో క్రెడిట్ లావాదేవీల పరిమాణం అసాధారణంగా పెరిగితే, వెంటనే దానిపై విచారణ చేపట్టాలని , అనుమానాస్పద లావాదేవీలను సంబంధిత అధికారులకు తెలియ జేయాలని ఆదేశించింది. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులో ఖాతా లేని కస్టమర్లు నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లి, నెఫ్టీ ద్వారా గరిష్టంగా రూ. 50,000 వరకు నగదును మరొక బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయవచ్చు. అలాగే బిజినెస్ కరస్పాండెంట్లు, ఏటీఎంలు, ఇతర అనుమతించబడిన మార్గాల ద్వారా కూడా వీరు నగదును పంపవచ్చు; అయితే, దీనికి ఒక్కో లావాదేవీకి రూ. 5,000 , ఒక వ్యక్తి నెలకు గరిష్టంగా రూ. 25,000 పంపేలా పరిమితి విధించబడింది. బ్యాంకు ఖాతా లేని లబ్ధిదారులకు నగదు చెల్లింపుల విషయానికి వస్తే, ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్లు లేదా ఇతర అధీకృత చెల్లింపు మార్గాల ద్వారా నగదును పంపవచ్చు.

ఇక్కడ ఒక్కో లావాదేవీకి రూ. 10,000 , ఒక లబ్ధిదారునికి నెలకు గరిష్టంగా రూ. 25,000 పరిమితి ఉంటుంది. ఈ పరిమితులు గతంలో ఉన్నవేనని, వీటిని తాజా మార్గదర్శకాల్లో కూడా కొనసాగించామని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. అంతే కాకుండా, డబ్బు పంపేవారు ( తమ మొబైల్ నంబర్‌ను ధృవీకరించు కోవాలని ‘నో యువర్ కస్టమర్’ నిబంధనల ప్రకారం స్వయంగా ధృవీకరించబడిన చెల్లుబాటు అయ్యే పత్రాన్ని సమర్పించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. డబ్బు పంపే బ్యాంకులు లేదా బిజినెస్ కరస్పాండెంట్లు, ఐఎంపీస్ లేదా నెఫ్ట్ లావాదేవీ సందేశంలో పంపేవారి వివరాలను తప్పనిసరిగా చేర్చాలని పేర్కొంది. అలాగే ఆ నగదు బదిలీ ‘నగదు ఆధారితమైనది’ అని గుర్తించేలా సందేశంలో ప్రత్యేక సూచికను కూడా పొందు పరచాలని స్ప‌ష్టం చేసింది. దీనికి అదనంగా బ్యాంకులు , బ్యాంకింగేతర సంస్థలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. ఈ మేర‌కు త‌మ బ్యాంకు ఖాతాదారుల‌కు సందేశాలు కూడా పంపిస్తున్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!