వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలో ఆయుధ పూజ

స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ మరియు ఈవో ముద్దాడ రవిచంద్ర

తిరుమ‌ల : తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కాంప్లెక్స్ (MTVAC)లో గురువారం ఆయుధ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ , ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ పద్మావతి అమ్మ వారు , శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద తయారీకి ఉపయోగించే యంత్రాలు, పరికరాలు ,పాత్రలకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఈవో ,అదనపు ఈవోలు అన్నప్రసాద విభాగం సిబ్బందిని సత్కరించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమల యాత్రలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనంతో పాటు, అన్నప్రసాద సేవ కూడా అత్యంత ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. గత రెండేళ్లలో అన్నప్రసాద ట్రస్టుకు సుమారు రూ. 1,100 కోట్ల విరాళాలు అందాయని, టీటీడీకి వచ్చే మొత్తం విరాళాలలో 53 శాతానికి పైగా అన్నప్రసాద ట్రస్టుకే లభించాయని తెలిపారు. సాధారణ రోజుల్లో మూడు లక్షల మందికి పైగా భక్తులకు, బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు సుమారు 4.60 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ ద్వారా ప్రతిరోజూ సుమారు 90,000 నుండి లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోందని వివరించారు.

1985లో కేవలం 2,000 మంది భక్తులతో ప్రారంభమైన అన్నప్రసాద సేవ కాలక్రమేణా ఎంతో విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అన్నప్రసాద ట్రస్టు నిధులు సుమారు రూ. 3,100 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. టీటీడీ పరిధిలోని మొత్తం 65 ఆలయాలకు కూడా అన్నప్రసాద సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్ఓ ముర‌ళీకృష్ణ‌, అన్నప్రసాదం డిప్యూటీ ఈఓ రాజేంద్ర కుమార్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ భాస్కర్, కేటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి , ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!