ఇందిరమ్మ జీవిత బీమా పేద కుటుంబానికి ఆర్థిక భరోసా

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ఇందిర‌మ్మ జీవిత బీమా పేద కుటుంబానికి ఆర్థిక భ‌రోసా క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర రెవిన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిర‌మ్మ పేరుతో జీవిత బీమా సౌక‌ర్యాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక కుటుంబం తన ప్రధాన ఆదాయ వనరును (కుటుంబ పోషకుడిని) కోల్పోయినప్పటికీ, ఆ కుటుంబం ఆర్థికంగా కుంగి పోకూడదనేదే మా సంకల్పం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు పొంగులేటి శ్రీినివాస్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో అనేక ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత.. ప్రతి ఇంటికి భరోసా.. పేద ప్రజల భవిష్యత్తును కాపాడాలనే గొప్ప సంకల్పంతో తాము ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా పథకం (Indiramma Family Life Insurance Scheme)ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని, ‘ఐరన్ లేడీ’ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఈ పథకాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు మంత్రి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షకు పైగా అర్హులైన కుటుంబాలకు రూ. 5 లక్షల విలువైన జీవన భీమా కవరేజీని కల్పిస్తామ‌న్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయినప్పుపు ఆ కుటుంబం అనాథగా మిగిలి పోకూడదని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల భవిష్యత్తు లేదా కుటుంబ జీవనోపాధి దెబ్బ తినకూడదని, కష్టకాలంలో ప్రభుత్వమే ఒక భరోసాగా నిలవాలనేదే ‘ఇందిరమ్మ జీవన భీమా పథకం’ ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!