అనస్వర రాజన్ పాత్రపై చిరంజీవి కామెంట్స్

న‌ట‌న‌పై కీల‌క సూచ‌న‌లు చేసిన మెగాస్టార్

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘కాక’ పనుల్లో బిజీగా ఉన్నారు. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి. ఈ సినిమాను 2027 జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌తో చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూసేందుకు మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ‘ఇట్లు అర్జున్’ చిత్ర విజయోత్సవ వేడుకకు చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి అనస్వర రాజన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె నటన గురించి ప్రస్తావిస్తూ తన మాటల ద్వారా ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు పొరపాటున బయట పడి పోతాయేమోనని చిరంజీవి సరదాగా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే,ఆమె పాత్ర గురించి పరోక్షంగా ఒక చిన్న క్లూ ఇచ్చి, ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచారు. అనస్వర రాజన్ నటనను మెచ్చుకున్న చిరంజీవి ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమెకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టముండదని సరదాగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, తాను చెప్పిన మాటలను గుర్తుంచుకుని, ఇంటికి వెళ్ళాక వాటి గురించి బాగా ఆలోచించమని అభిమానులకు సూచించారు.

ఆయన చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ప్రియుల మధ్య చర్చనీయాంశమయ్యాయి. చిరంజీవి ఉద్దేశం ఏమిటి? ‘ఇట్లు అర్జున్’ చిత్రంలో అనస్వర రాజన్ ఎలాంటి పాత్ర పోషించారు? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించక పోయినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆ నటి పాత్రపై మరింత కుతూహలాన్ని కలిగించాయి.

Leave A Reply

Your Email Id will not be published!