అమరావతి : రాజకీయ విమర్శలకు ఒక హద్దు, మీడియా స్వేచ్ఛకు ఒక సామాజిక బాధ్యత ఉంటాయని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీతల సుజాత అన్నారు. కనీస విలువలు లేకుండా కుటుంబ వ్యవహారాలను కూడా రాజకీయ కక్ష కోణంలో చూస్తూ, జుగుప్సాకరమైన రాతలు రాయించడం ఒక్క జగన్ మోహన్ రెడ్డి కి, ఆయన సొంత పత్రిక ‘సాక్షి’కి మాత్రమే చెల్లిందని ఆమె మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాద పూర్వకంగా కలిస్తే, దానిపై ‘బాబుతో చెట్టపట్టాల్’ అంటూ సాక్షి పత్రికలో అత్యంత నీచంగా వార్తలు రాయడం దారుణం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సమకాలికులుగా ఉన్నారని తెలిపారు. ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్నారన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రిని.. అందులోనూ తన తండ్రి లాంటి వ్యక్తిని కలిసి తన కూతురి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించడంలో తప్పేముంది? అని ప్రశ్నించారు పీతల సుజాత.
మన తెలుగు సంప్రదాయంలో శుభకార్యాలకు పెద్దలను పిలవడం ఒక గౌరవ ప్రదమైన ఆచారంగా వస్తోందన్నారు. దానిని కూడా ఇంత దుర్మార్గంగా వక్రీకరించి, అసభ్యకరమైన పదజాలంతో రాయించేలా జగన్ మోహన్ రెడ్డి దిగజారి పోవడం సిగ్గుచేటు అన్నారు . అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? మీ ఆలోచనా విధానం రోజురోజుకూ ఎందుకు ఇంతలా పతనమైపోతోంది? సొంత చెల్లి అనే విషయాన్ని పక్కన పెడితే.. ఒక మహిళ, తన తండ్రి వయసున్న వ్యక్తి వద్దకు వెళ్లి శుభకార్యానికి ఆహ్వానిస్తే ఇంత హీనాతిహీనంగా అవమానిస్తారా? సాక్షి పత్రిక ద్వారా మీరు అవమానించింది కేవలం షర్మిల ని మాత్రమే కాదు, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, యావత్ మహిళా లోకాన్ని అవమానించారన్నారు. రాజకీయ లబ్ధి కోసం సొంత కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే ఇలాంటి దిగజారుడు రాతలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు పీతల సుజాత. మహిళల పట్ల గౌరవం లేని ఇలాంటి ప్రవర్తనకు జగన్ మోహన్ రెడ్డి , సాక్షి యాజమాన్యం తలదించు కోవాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఒక శుభకార్య ఆహ్వానంపై బురద జల్లి వక్రీకరించినందుకు మీరు మహిళా లోకానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు పీతల సుజాత. మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో మహిళలే మిమ్మల్ని తరిమికొట్టే రోజు వస్తుందని గుర్తు పెట్టుకోండని హెచ్చరించారు.