హైదరాబాద్ : టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి శ్రీలీల తన కెరీర్ , చిత్రాల ఎంపిక గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వయంగా నిర్మించిన ‘ఓమ్’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ , కూలీలపై జరిగిన పోలీసు కాల్పుల వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిందని సమాచారం. ఇందులో ధనుష్ సరసన శ్రీలీల కథానాయికగా నటించగా, సాయి పల్లవి శక్తివంతమైన ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.ప్రమోషనల్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ నేను ఎక్కడికి వెళ్లినా, నన్ను ఒక తెలుగు అమ్మాయిగా గుర్తిస్తారు. ఆ గుర్తింపు నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తుంది అని పేర్కొన్నారు. ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలోనే తనకు అనేక చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయని చెప్పారు. అయితే చదువుకు సంబంధించిన బాధ్యతల వల్ల వాటిని అంగీకరించలేక పోయానని శ్రీలీల వెల్లడించారు. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత తన ముందుకు వచ్చిన అవకాశాలను స్వీకరించానని ఆమె చెప్పారు.
కాలక్రమేణా తాను ఎంచుకున్న కొన్ని చిత్రాల గురించి తనకు సందేహాలు కలిగాయని ఆమె అంగీకరించారు. ఒక దశలో, నేను ఎంచుకున్న సినిమాల విషయంలో నాకు అనుమానాలు మొదలయ్యాయి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా గతంలో చేసిన సినిమాల గురించి ఆలోచించేదాన్ని. అలా ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా నా కెరీర్లో ఎక్కడ తప్పులు చేశానో స్పష్టంగా అర్థమైంది అని శ్రీలీల నిజాయితీగా చెప్పారు. ‘ఓమ్’ తన కెరీర్లో ఒక ప్రత్యేకమైన చిత్రమని పేర్కొన్నారు. కథ చెప్పక ముందే ఈ చిత్రంలో పాటలు ఉండవని దర్శకుడు స్పష్టంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు.
గత అనుభవాలను తాను ఎంచుకున్న చిత్రాలను విశ్లేషించుకున్న శ్రీలీల ఇప్పుడు భిన్నమైన పాత్రలు, కథల వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణ వాణిజ్య అంశాలు ఏవీ లేకుండా, గంభీరమైన కథాంశంతో రూపొందుతున్న ‘ఓం’ చిత్రంలో ఆమె నటన ఎలా ఉండబోతుందో చూడాలంటే ప్రేక్షకులు నవంబర్ 20 వరకు వేచి చూడాల్సిందే.