పదేళ్లలో దేశం లోనే అగ్రస్థానానికి ఏపీ : అమిత్ షా

రామోజీరావు అందించిన సేవలు ప్ర‌శంస‌నీయం

విజ‌య‌వాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ నిరంతరం అభివృద్ధి చెందుతోందని అమిత్‌ షా ప్రశంసించారు. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందా అని తొలుత భావించానని, అయితే చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టారని అన్నారు. దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి గణాంకాలను తాను నిశితంగా పరిశీలిస్తుంటానని, వచ్చే పదేళ్లలో చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ సంస్థ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణమని అన్నారు. అమెరికా వెలుపల గూగుల్‌ ఏర్పాటు చేయనున్న తొలి డేటా సెంటర్‌ ప్రాజెక్టు దేశ డిజిటల్‌ రంగానికి కీలకమవుతుందని పేర్కొన్నారు. విశాఖ తీరంలో సముద్రగర్భం నుంచి ఏర్పాటు చేస్తున్న సబ్‌సీ కేబుల్‌ కూడా అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టు అని వివరించారు. రాష్ట్రానికి తొలి సెమీకండక్టర్‌ యూనిట్‌, స్టీల్‌ ఫ్యాక్టరీలు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు.

రెండున్నరేళ్లలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని ప్రశంసించారు. గతంలో కొందరి తప్పులతో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి రైతులకు, ప్రజలకు నీరందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని అమిత్‌ షా అన్నారు. కొందరు వ్యక్తులు తమ కృషితో సంస్థలుగా, వ్యవస్థలుగా మారిపోతారని.. వారి సేవలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తుల్లో రామోజీరావు ఒకరని పేర్కొన్నారు. రామోజీరావును రామ్‌నాథ్‌ గోయెంకా వంటి విశిష్ట పాత్రికేయులతోనే పోల్చగలమన్నారు. మారుతున్న కాలానికి, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రామోజీరావు తన సంస్థలను అభివృద్ధి చేశారని అమిత్‌ షా వివరించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పత్రికను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిపారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్‌, అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధాల కారణంగా పలు దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నా భారత్‌ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గత 12 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గతంలో ఏటా వేల సంఖ్యలో నక్సల్‌ దాడులు జరిగేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!