శ‌ర్వానంద్ ‘భోగి’ మూవీ విడుద‌ల వాయిదా

భారీ ఆశ‌లు పెట్టుకున్న అభిమానులు

హైద‌రాబాద్ : అత్యంత ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు సంప‌త్ నంది. టేకింగ్ మేకింగ్ లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. త‌న‌ దర్శకత్వంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ సంస్థ, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ ప్రకటనలో మా అందరికీ ‘భోగి’ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఎంతో ఆశయం, అభిరుచి , అంకితభావంతో రూపొందించిన ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనేదే మా లక్ష్యం అని పేర్కొంది.

అంతేకాకుండా అనుకోని కారణాల వల్ల ‘భోగి’ విడుదల వాయిదా పడింది. సినిమా విడుదల గురించి వస్తున్న ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దు లేదా ప్రచారం చేయవద్దు అని కోరుతున్నామ‌ని తెలిపింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మార్పు వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్న చిత్ర బృందం ‘భోగి’ని అత్యుత్తమ రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే క్రమంలో అందరి సహకారం, ఓపిక , అవగాహన ఉండాలని కోరింది. చివరగా ఈ నిరీక్షణకు తగిన ప్రతిఫలం లభించేలా చేస్తామని హామీ ఇస్తున్నాము అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా మొదట నవంబర్ 12 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.

నటుడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆయన ‘గంగ’ అనే పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. 1960ల నాటి నేపథ్యంలో సాగే ‘భోగి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక కల్పిత గ్రామంలో జరిగే కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ మాన్నే ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు; ఇది తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం అనే నాలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర బృందం త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Leave A Reply

Your Email Id will not be published!