న్యూఢిల్లీ : మంచి పుస్తకాలు గతం గురించిన నిజాన్ని చెబుతూ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని అన్నారు సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ . ఆయన ఢిల్లీలో జరిగిన సోనియా గాంధీ రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా నిరంతరం పుస్తకాలు చదవుతానని తెలిపారు. పుస్తకాలు ప్రతిఒక్కరికీ చదవడానికి, ఎదగడానికి సమాన అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. ముద్రణా యంత్రాన్ని కనుగొని, పుస్తకాలను ముద్రించి, పంపిణీ చేసి, అమ్మడం ప్రారంభించినప్పుడే పునరుజ్జీవనం మొదలైందని ప్రపంచ చరిత్ర సాక్ష్యమిస్తోందన్నారు అఖిలేష్ యాదవ్. సమాజాన్ని నిద్రలో ఉంచాలని అనుకునేవారు పుస్తకాలకు శత్రువులుగా మారుతారని పేర్కొన్నారు. వారు స్వయంగా పుస్తకాలు రాసినప్పటికీ, వారి ఉద్దేశ్యం సమాజాన్ని మేల్కొలపడం కాదు, తమ సొంత అజెండాలో బంధించి నిద్ర పుచ్చడమే తప్పా మరోటి కాదంటూ ఎద్దేవా చేశారు.
సానుకూల, ప్రగతిశీల ఆలోచనలు గల మంచి వ్యక్తులు పుస్తకాల ద్వారా సమాజంలో ప్రజా చైతన్య బీజాలు నాటుతారని అన్నారు అఖిలేష్ యాదవ్. సంకుచిత మనస్తత్వం గలవారు యథాతథ స్థితిని కాపాడుకోవాలని అనుకుంటారని అన్నారు. అందుకే వారు పుస్తకాలను వ్యతిరేకిస్తారు. వారు ‘జ్ఞాపకశక్తి’కి మద్దతు ఇస్తారు కానీ పుస్తకాలకు కాదు. యథాతథవాదులకు ఏ పుస్తకం అత్యంత చికాకు తెప్పిస్తుందంటే, అది ‘రాజ్యాంగం’ అని పేర్కొన్నారు. నిజం ఏమిటంటే, రాజ్యాంగం నిలబడితే, ప్రతి పుస్తకం నిలబడుతుందని అన్నారు అఖిలేష్ యాదవ్ . ఎందుకంటే భావప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగం మాత్రమే కాపాడగలదు, ‘భావప్రకటనా స్వేచ్ఛ’ హక్కు ఉన్నంత కాలం మాత్రమే పుస్తకాలు ప్రచురించ బడతాయని తెలిపారు. నిజమైన పుస్తకాలు దీపస్తంభాల వంటివని, అవి మనకు సరైన దిశను, సరైన తీరాన్ని చూపిస్తూ, మనం దారి తప్పకుండా కాపాడతాయని తెలిపారు.