Putin Ukraine War : రాజ్యం బలీయమైనది కావచ్చు గాక. కానీ చరిత్రలో తామే రాజులమని విర్రవీగిన వాళ్లు. తమ రాజ్యం, ఏర్పాటైన ప్రభుత్వం శాశ్వతం అనుకున్న వాళ్లు కాలగర్భంలో కలిసి పోయారు. నామ రూపాలు లేకుండా పోయారు.
ఒకప్పుడు రష్యా ఇప్పుడున్న రష్యాకు చాలా తేడా ఉంది. ప్రపంచానికి ఊపిరి పోసి,
దిశా నిర్దేశం చేసి కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచిన రష్యా(Putin Ukraine War) ఇవాళ యావత్ ప్రపంచం ముందు దోషిగా నిలబడింది.
కేవలం లొంగి పోవడం లేదన్న కుంటి సాకుతో సైనిక చర్యకు దిగుతున్నానని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ముమ్మాటికీ నేరస్థుడే. రాజకీయాల్లో నేరుగా చంపడాలు ఉండవు.
వెన్నుపోట్లు మాత్రమే ఉంటాయన్న దానిని చెరిపి వేయడం నీకే చెల్లింది. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది.
దానిని కాదనే హక్కు, చంపే హక్కు ఎవరికీ లేదు.
కానీ డియర్ పుతిన్ నువ్వు చేస్తున్న ఈ అప్రకటిత వార్ మాత్రం నీ కోసం మాత్రమే చేసుకున్నది. నిన్ను నీవు కాపాడు కోవడానికో లేదా నిన్ను నీవు గొప్ప వాడివని ఈ ప్రపంచానికి తెలియ చెప్పేందుకో చేసిన పని తప్ప ఇంకొకటి కాదు.
నువ్వు అధ్యక్షుడివే కావచ్చు. నీ చుట్టూ మందీ మార్బలం, ఆయుధాలు, క్షిపణలు ఉండి ఉండవచ్చు. కానీ ప్రజాగ్రహం ఒక్కటైన రోజున,
పెల్లుబికిన రోజున నీవు ఏర్పాటు చేసుకున్న భవనాలు, రాజ సౌధాలు, ఆయుధాలు , సైనిక దళాలు ఏవీ కాపాడు కోలేవని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది.
తాను భయపెట్టాలని అనుకున్న వాడు లోలోపట భయ పడతాడన్నది వాస్తవం.
గర్జించు రష్యా(Putin Ukraine War) గాండ్రించు రష్యా అని రాసిన మహాకవి శ్రీశ్రీ బతికి ఉంటే చూసి తట్టుకోలేక పోయేవాడు.
పుతిన్ .ఇప్పటికైనా తప్పు తెలుసుకో. ఇతరులను చంపే హక్కు లేదని గుర్తించు. లేక పోతే చరిత్ర క్షమించదు పుతిన్. ఆగ్రహం ఆయుధం కాక ముందే మేలుకో.
ఇకనైనా మారక పోతే రాబోయే రోజుల్లో ప్రపంచం నిన్ను వెలివేసే రోజు తప్పకుండా వస్తుందని తెలుసుకో.
Also Read : దాడుల పరంపర ఆగని మారణకాండ