Aam Aadmi Party: మద్యం పాలసీ కుంబకోణం కేసులో ఈడీ ప్రకటనపై ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ !

మద్యం పాలసీ కుంబకోణం కేసులో ఈడీ ప్రకటనపై ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ !

Aam Aadmi Party: ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులతో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత… ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు రూ. 100 కోట్లు చెల్లించిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌ సభ ఎన్నికల ముందు తమ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. అంతేకాదు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌… బీజేపీ పొలిటికల్‌ వింగ్‌ లా పనిచేస్తోందని తీవ్రంగా స్పందించింది.

Aam Aadmi Party Comment

ఈ సందర్భంగా ఆప్(AAP) స్పందిస్తూ… ‘‘గతంలోనూ ఈడీ ఇలాంటి అవాస్తవ ప్రకటనలు విడుదల చేసింది. ఈ కేసులో 500లకు పైగా సోదాలు జరిపినా… వేల మంది సాక్ష్యులను విచారించినా దర్యాప్తు సంస్థకు అక్రమంగా ఉన్నట్లు నిరూపించేలా ఒక్క రూపాయి కూడా లభించలేదు. చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలేదు. అందుకే విసుగెత్తిపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఒక్క కొత్త విషయం లేదు. ఇవన్నీ చూస్తుంటే కేసులో తటస్థ దర్యాప్తు విధానాన్ని వదిలేసి… భాజపాకు పొలిటికల్‌ వింగ్‌ లా ఈడీ పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు’’ అని ఆ పార్టీ మండిపడింది.

ఢిల్లీ మద్యం పాలసీ కుంబకోణం కేసులో తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా… ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కవిత అరెస్ట్ పై ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు.

ఆప్‌ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియాతో కలిసి ఈమె అవినీతికి పాల్పడ్డారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. హోల్‌సేల్‌ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారు. ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌తోపాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ. 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం’’ అని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Also Read : YSRCP MLA Arthur: వైసీపీకి షాక్ ! కాంగ్రెస్‌ లో చేరిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ !

Leave A Reply

Your Email Id will not be published!