AP DSC 2024: ఏపీలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా !
ఏపీలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా !
AP DSC 2024: నాలుగున్నరేళ్ళ తరువాత ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ కు ఆది నుండి అవాంతరాలు ఏర్పడ్డాయి. దీనితో ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా ? వాయిదా వేస్తారా ? అనే సందిగ్ధతకు ఈసీ తెరదించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ప్రభుత్వాన్ని ఆదేశించారు.
AP DSC 2024 Updates
హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే డీఎస్సీ(DSC) షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు… మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి ఆఫ్షన్స్ పెట్టుకోవాలని, 25 నుంచి హాల్టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ, ఇంతవరకు వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శనివారం సీఈవో ప్రకటనతో అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలను మార్చి 14నే విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. దీనితో ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత టెట్ ఫలితాల విడుదల చేయాలని ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దాదాపు ఐదేళ్ల పాటు కాలయాపన చేసిన వైసీపీ ప్రభుత్వం కేవలం ఎన్నికలకు కొన్ని నెలల ముందు హడావుడిగా టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చంది. సుమారు 6,100 పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ ఇవ్వడం… కేవలం రోజుల వ్యవధిలోనే టెట్, డిఎస్సీల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రిపేర్ కావడానికి కూడా తగిన సమయం కూడా ఇవ్వకుండా డీఎస్సీ షెడ్యూల్ రూపొందించడంతో… కోర్టు ఆదేశాలతో పరీక్షల తేదీలను ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో టెట్ పరీక్ష పూర్తయినప్పటికీ, డిఎస్సీ పరీక్షల నిర్వహణ పూర్తి కాలేదు. దీనితో టెట్ పరీక్షా ఫలితాలు, డిఎస్సీ నిర్వహణ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది.
Also Read : Nara Chandrababu Naidu: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ – చంద్రబాబు