హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం.. అక్షరాభాస్యాలకు ఆలవాలమైన క్షేత్రం పునః నిర్మాణంతో కొత్త శోభను సంతరించు కోబోతోంది. వేద వ్యాస మహర్షితో ప్రతిష్టతమైన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం.. కోనేరు.. ఉత్తర ద్వారం అభివృద్ధి.. ధ్యాన మందిరాలతో మరింతగా భక్తుల మనస్సులను ఆకట్టకోనుంది. వేల ఏళ్ల ఘన చరిత్ర గల్గిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునః నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించింది.
దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు.. కురుక్షేత్ర యుద్ధానంతరం ప్రశాంతత కోసం వేద వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారట.. ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహా లక్ష్మి, మహా కాళి అమ్మ వార్ల మూర్తులను ప్రతిష్టించారనేది స్థల పురాణం.. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది.
జ్ఞాన సరస్వతి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. వసంత పంచమి, ఇతర పర్వ దినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం.. ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టక పోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
