MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు !
ఢిల్లీ మద్యం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు !
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత… ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందన్నారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం… కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
MLC Kavitha Case Updates
ఈ విచారణ సందర్భంగా కవితతో పాటు ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ అరెస్ట్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ కు కవిత స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ, ఈడీ తరఫున న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలుగుతారన్నారు. ఈ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని… సూత్రధారి, పాత్రధారి ఆమేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారం కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అందుకు సంబంధించి తీర్పులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా కీలక అంశాలను ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చే విషయంలో నేర స్వభావం, నేర తీవ్రత, నేరం రుజువైతే విధించే గరిష్ట శిక్షాకాలాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఫిర్యాదుదారుడికి లేదా సాక్షులకు ముప్పు కల్గించే పరిస్థితి ఉండరాదని స్పష్టం చేశారు. నిందితులు తప్పించుకుని పారిపోయే అవకాశాలను కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. నిందితుల వ్యక్తిత్వం, స్వభావం, ప్రవర్తనను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి అవసరం ఉందని చెప్పారు. విస్తృత ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర – దేశ ప్రయోజనాలను సైతం దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఏపీ సీఎం వైయస్ జగన్ కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలను ఈ సందర్బంగా జడ్జి ప్రస్తావించారు. ఈ కేసులో మెరిట్స్ జోలికి వెళ్లకుండా ఈ స్థితిలో బెయిల్ ఇవ్వడం తగదని భావిస్తున్నానని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తన తీర్పులో పేర్కొన్నారు.
Also Read : Radhika Khera: కాంగ్రెస్ పై రాధికా ఖేరా సంచలన ఆరోపణలు !