Red Sandal Smugglers: ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్య !
ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్య !
Red Sandal Smugglers: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు దారుణానికి ఒడిగట్టారు. అక్రమ ఎర్ర చందనం తరలింపును అడ్డుకునేందుకు… కేవీపల్లి మండలం సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు కానిస్టేబుల్ ను వాహనంతో ఢీ కొట్టి చంపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ గణేష్ కు తీవ్ర గాయాలవగా… పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రంగంలోనికి దిగిన పోలీసులు… ఎర్ర చందనం వాహనంతో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్ఫోర్స్ సిబ్బందికి సమాచారం వచ్చింది. దీనితో సోమవారం రాత్రి సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద సిబ్బంది కాపు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు యత్నించాడు. అయితే తనిఖీల నుండి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు అతడిని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
Red Sandal Smugglers – జగన్ పెంచి పోషిస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్లలు పోలీసులను లెక్కచేస్తారా ? – చంద్రబాబు
అన్నమయ్య జిల్లాలో(Annamayya District) ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ చనిపోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘‘స్మగ్లర్లు, గూండాలకు సీఎం జగన్ ప్రాధాన్యమిస్తుంటే వారు పోలీసులను లెక్కచేస్తారా ? టాస్క్ఫోర్స్ను వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేసింది. ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ గణేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలి. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైసీపీ అండతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు – నాదెండ్ల మనోహర్
శేషాచలం అడువుల్లో విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ముఠాలను వైసీపీ పెంచి పోషిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పాలకపక్షం అండతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారన్నారు. అన్నమయ్య జిల్లాలో కానిస్టేబుల్ను వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన దుర్మార్గపు ఘటన వెనక ఎవరున్నారో నిగ్గుతేల్చాలన్నారు. స్మగ్లర్లు ఇంతటి దురాగతానికి పాల్పడినప్పటికీ ఆ ముఠా వెనక ఎవరున్నారో పోలీసులు వెల్లడించకుండా గోప్యత పాటించడం పలు సందేహాలకు తావిస్తోందన్నారు. అటవీ శాఖ స్వాధీనంలో ఉన్న ఎర్రచందనాన్ని వైసీపీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో సక్రమంగా విక్రయించలేకపోతోందని… స్మగ్లర్లు మాత్రం ఇష్టారాజ్యంగా సరిహద్దులు దాటించేస్తున్నారన్నారని పేర్కొన్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందన్నారు. కానిస్టేబుల్ గణేష్ ను హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read : Karnataka CM: సీఎంకు జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు !