Duggirala Gopalakrishnayya: “ఆంధ్ర రత్న” దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
"ఆంధ్ర రత్న" దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
Duggirala Gopalakrishnayya : దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (జూన్ 2, 1889 – జూన్ 10, 1928): కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జన్మించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధునిగా, కవిగా, వక్తగా, గాయకునిగా గుర్తింపు పొందారు. మూడవ రోజునే తల్లిని, మూడవ ఏటనే తండ్రిని కోల్పోయిన గోపాలకృష్ణయ్య(Duggirala Gopalakrishnayya) పినతండ్రి, నాయనమ్మ సంరక్షణలో పెరిగారు. బాపట్లలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసి గుంటూరులోని నడింపల్లి నరసింహారావు అనే మిత్రుడి సహాయంతో స్కాట్లాండ్ లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తిచేసారు.
Duggirala Gopalakrishnayya – గాయకునిగా, స్వాతంత్ర్య సమర యోధునిగా గోపాలకృష్ణయ్య
హైస్కూలులో చదివే సమయంలోనే ‘జాతీయ నాట్య మండలి’ స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించిన గోపాలకృష్ణయ్య ‘నందికేశ్వరుడు’ రచించిన ‘అభినయ దర్పణం’ అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో ‘కేంబ్రిడ్జ్ – హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్’ వారిచే ప్రచురించబడింది. స్కాట్లాండ్ లో చదువు పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చిన గోపాలకృష్ణయ్య… రాజమండ్రి, బందరులో కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసారు. అయితే తనకు ఉన్న స్వతంత్ర భావాల వలన పై వారితో ఏర్పడిన వైరం కారణంగా ఉద్యోగం వదిలిపెట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1919 లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినపుడు, అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి గోపాలకృష్ణయ్య ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.
రచయితగా గోపాలకృష్ణయ్య
స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను రాజకీయ చైతెన్యులుగా చేయడానికి ‘సాధన’అనే ఆంగ్ల పత్రిక స్ధాపించారు. తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఎంతో కృషి చేశాడు. గోపాలకృష్ణయ్య సంస్కృతం, తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషు భాషలలో నిష్ణాతుడైన బహుభాషాకోవిదుడు మరియు పద్యాల యొక్క అద్భుతమైన స్వరకర్త. తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు వంటి ఎన్నో జానపద కళారీతులను ఆయన ప్రచారం చేసారు. దీనితో 1921 లో గుంటూరులో జరిగిన సభలో “ఆంధ్ర రత్న” అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.
Also Read : Papineni Sivasankar: తెలుగు నాట సుప్రసిద్ధ కవి