అమరావతి : ఏపీలో 1000కి పైగా ఆధునిక గోడౌన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బహుళార్థ సాధక సౌకర్య కేంద్రాలు లుగా అభివృద్ధి చేసే కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమగ్రంగా సమాధానం ఇచ్చారు. జూన్ 2020లో కేంద్ర ప్రభుత్వ ఏఐఎఫ్ పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, రైతు భరోసా కేంద్రం స్థాయిలో నిల్వ, ఆరబెట్టే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. విశాఖపట్నం జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా గోడౌన్లు , డ్రైయింగ్ యార్డుల నిర్మాణం జరుగుతోందని, మొత్తం రూ.504.42 కోట్ల వ్యయంతో ఈ పథకం అమలవుతోందని పేర్కొన్నారు. నాబార్డ్ ద్వారా రీఫైనాన్స్ సదుపాయం కల్పించబడుతుందని, PACSలకు 4% వడ్డీపై 3% వడ్డీ రాయితీ లభిస్తుందని, 90% రుణం మరియు 10% మార్జిన్ మనీ విధానంలో ప్రాజెక్టులు అమలవుతున్నాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ కింద రూ.50.4 కోట్లు మంజూరు చేసి అందులో రూ.20 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని, 33 సంవత్సరాల పాటు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దెకు ప్రభుత్వ భూమి లీజుకు ఇస్తున్నట్లు చెప్పారు అచ్చెన్నాయుడు. రిజిస్ట్రేషన్ ఫీజు మరియు స్టాంపు డ్యూటీ మినహాయింపు కల్పించినట్లు చెప్పారు. ఈ పథకం కింద రుణాలకు ప్రభుత్వ హామీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1005 MPFC గోడౌన్ల పనులు ప్రారంభమై, 717 గోడౌన్లు మరియు అనుబంధ డ్రైయింగ్ యార్డులు పూర్తయ్యాయని, 572 PACSలో 1111 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి తేమ మీటర్లు, తూనిక బ్యాలెన్స్‌లు, డెస్క్‌టాప్‌లు సరఫరా చేసినట్లు తెలిపారు. 232 PACSలలోని 462 అసేయింగ్ కేంద్రాలకు అవసరమైన ల్యాబ్ పరికరాలు అందించామని చెప్పారు.
