శ్రీ పద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణ వేగం పెంచాలి
నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జేఈవో ఆదేశాలు
తిరుపతి : తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. టిటిడి ఈవో ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి భవనం పనుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి, నిర్ణీత కార్యాచరణ ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల వేగాన్ని మరింత పెంచేందుకు అవసరమైన నిపుణులు, కార్మికులు, నిర్మాణ సామగ్రిని తక్షణమే సమకూర్చాలన్నారు. అలాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, గార్డెనింగ్, క్లీనింగ్, నిర్వహణ తదితర మౌలిక సదుపాయాల పనులను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు.
భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని, ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వారానికోసారి నిర్మాణ స్థలాన్ని సందర్శించి పనుల స్థితిగతులను పరిశీలిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తామన్నారు .ప్రతి అంతస్తులో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు జేఈవో, నాణ్యత విషయంలో రాజీ పడకుండా, ఇంజినీరింగ్ పనుల్లో ఎలాంటి అలసత్వానికి అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేశారు.
