అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. జీవ నది అయిన పవిత్ర గోదావరి నదిని మున్సిపల్, పారిశ్రామిక కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించి స్వచ్ఛమైన నదీ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు అవసరం అయిన సలహాలు, సూచనలు చేయాలని కేంద్ర సర్కార్ ను కోరామన్నారు. తమ విన్నపాన్ని మన్నించచి గోదావరి కాలుష్యంపై అధ్యయనానికి కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులను పంపుతామని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ హామీ ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో అడవి దున్నల (ఇండియన్ గోర్)ను పునరుద్దరణ చర్యలకు సహకారం కోరాం అన్నారు. మధ్యప్రదేశ్ నుంచి 50 అడవి దున్నలను ఇప్పించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తో ఫోన్ లో మాట్లాడారని చెప్పారు.
సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వాటిని రాష్ట్రానికి పంపేందుకు వారు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. ఇండియన్ గోర్ సంరక్షణ కోసం ఇప్పటికే ఇంక్లోజర్లు కూడా సిద్ధం చేశాం. తాను స్వయంగా మధ్యప్రదేశ్ వెళ్లి మరోసారి విజ్నప్తి చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ కొణిదల. దీంతో పాటు రాష్ట్రంలో మగ పులుల సంఖ్య పెరిగి, ఆడ పులుల సంఖ్య తగ్గింది. దీని వల్ల జన్యుపరమైన సమస్యలు వస్తున్నాయి. అందుకోసం ఆరు ఆడ పులులను రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు సహకారం కోరాం అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడితే 4 ఆడ పులులు ఇచ్చేందుకు అంగీకరించారు. మధ్యప్రదేశ్ నుంచి మరో రెండు తీసుకోనున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల బెడద నుంచి ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఒడిశా నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు ఇప్పించాలని కోరాం. అక్కడ ప్రభుత్వం కూడా మా అభ్యర్ధన పట్ల సుముఖత వ్యక్తం చేసిందన్నారు డిప్యూటీ సీఎం.