పుట్టపర్తి శ్రీ సత్య సాయి జిల్లా : ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ విధ్వంస పాలన చేశారని మంత్రి సవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమ్మఒడి, పెన్షన్లు పెంపు పేరుతో ప్రజలను జగన్ వెన్నుపోటు పొడిచారన్నారు. 2019 ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. బీసీ సంక్షేమ శాఖ తరఫున గతంలో కూడా అమలు చేయని ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు హాస్టళ్లు, గురుకులాల్లో ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయన్నారు.
వసీపీ, కూటమి ప్రభుత్వాల అభివృద్ధిపై చర్చకు రావాలని జగన్ కు మంత్రి సవిత సవాల్ విసిరారు. ఏ శాఖపైనైనా, రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలోనైనా చేపట్టిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగుల పెట్టడంలో మంత్రి నారా లోకేశ్ కాలి గోటుకు కూడా జగన్ గాని, ఆయన పార్టీ నాయకులు గాని సరిపోరని మంత్రి సవిత అన్నారు. 2014-19లో రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా నారా లోకేశ్ గ్రామాల్లో విస్తృతంగా రహదారులు నిర్మించారన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పీఆర్ మంత్రిగా పంచాయతీల్లో రోడ్లు నిర్మిస్తున్నారన్నారు. 2019-24 మధ్య ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు.
ఆనాడు ప్రభుత్వంలో పీఆర్ శాఖ నిద్రపోయిందా..? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ, పంచాయతీల్లోనూ బీటీ, సిమ్మెంట్ రోడ్లను విస్తృతంగా చేపట్టామన్నారు. కూటమి పాలనతోనే రాష్ట్రాభివృద్ధి అని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కూటమిలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనైనా కూటమి మద్దతుదారులే గెలవాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలొచ్చారు.
