పోలవరం : దేశంలోని అతిపెద్ద బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన పోలవరం ప్రాజెక్టును ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం సందర్శించింది. ఏపీ దర్శన్ కార్యక్రమం లో భాగంగా 2025 బ్యాచ్ ట్రైనీ ఐ ఏ ఎస్ అధికారులు సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హరి ఓం పాండియా, క్షితిజ్ ఆదిత్య శర్మ,నమ్రత్ అగర్వాల్, పవన్ తేజా ఏ ఆర్, ప్రియా, సుయాష్ కుమార్, వెంకటేష్ బన్నా పోలవరం ప్రాజెక్ట్ , జలవిద్యుత్ కేంద్రం తో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ను సందర్శించారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ రెడ్డి రామచంద్ర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ, డిఈ శ్రీనివాస్, ఎంఈఐఎల్ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఎ. గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి ట్రైనీ ఐఏఎస్ అధికారులకు ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు లక్ష్యాలు, రూపకల్పన, నిర్మాణ పురోగతి, సాంకేతిక సవాళ్లు, పూర్తయిన తర్వాత కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి సదుపాయం, తాగునీటి సరఫరా, జలవిద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ వంటి అంశాల్లో కలిగే ప్రయోజనాలను వివరించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనులు, ప్రధాన నిర్మాణ భాగాలు, ప్రాజెక్టు పురోగతికి చేపడుతున్న చర్యల గురించి కూడా వివరించారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను సందర్శించి, జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు అమలులో ఉన్న సాంకేతిక, పరిపాలనా, పర్యావరణ అంశాలపై అధికారులు, ఇంజనీర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్ అధికారులు పోలవరం ప్రాజెక్టు విస్తృతి, నిర్మాణ సంక్లిష్టతపై ప్రశంసలు వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా దోహద పడుతుందని పేర్కొన్నారు.