అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు నోరు జారడంపై. రోజు రోజుకు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, ఒక హద్దు పద్దు లేకుండా పోయిందన్నారు. బుధవారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేకంగా రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనితపై ఓ మాజీ మంత్రి చేసిన దారుణమైన బూతు భాష పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇలాగే కంటిన్యూ చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేయడమంటే సగటు మహిళలను కించపరచడం తప్పా మరోటి కాదన్నారు. మనం మాట్లాడే ప్రతి మాటనూ పౌర సమాజం గమనిస్తోందని మరచ పోవద్దని హితవు పలికారు. వంగలపూడి అనితపై కామెంట్స్ చేసిన వారు వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిదేనని లేక పోతే తాము చెప్పిస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. ఈ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీ వారు దిగజారి పోవడం బాధాకరమన్నారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఆ వ్యాఖ్యలు కేవలం ఆమెను అన్నట్టు మాత్రమే కాదని రాష్ట్రంలోని ప్రతి మహిళ గురించి అన్నట్టు భావించాల్సి ఉంటుంందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని, అయితే అవి విధాన పరంగానే ఉండాలన్నారు. ఒక పాలసీ నచ్చక పోతే ఆ పాలసీ విషయంపైనే విమర్శించాలని పేర్కొన్నారు. . కూటమి నేతలందరికీ ఒక సూచన చేస్తున్నాను. వాచలత్వంతో ఇళ్లలోని స్త్రీలను సైతం కించపరచే నైజం ఉన్న పార్టీ చేసే కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టేటప్పుడు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతటి అభ్యంతరకరమైన విషయం ఉందో ప్రజలకు తెలియ చెప్పాలని అన్నారు.
