ప్రకాశం జిల్లా : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఉపాధి హామీ పథకం పేదలు, కూలీల పాలిట శాపంగా మారందని, ఏపీ రాష్ట్రానికి భరించలేని భారంగా మారందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర నెల్లూరు జిల్లాలో ముగిసింది. శుక్రవారం ప్రకాశం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్బంగా కొండేపి నియోజక వర్గం, పాకల గ్రామ ప్రజలతో రచ్చబండ నిర్వహించారు షర్మిలా రెడ్డి. మోడీ తెచ్చిన VB G- RAM G చట్టం రాష్ట్రానికి పెనుభారంగా మారిందని మండిపడ్డారు. ఏటా 5 వేల కోట్ల భారం పడుతుంటే చంద్రబాబు మోదీకి జై కొట్టడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు .
వైఎస్సార్ ఆశయాల నుంచి పుట్టిన ఉపాధి పని పై మోదీ కుట్రలు చేస్తుంటే జగన్ మౌనం వహించడం దారుణం అన్నారు. దత్త పుత్రుడు జగన్ కూటమి పార్టీలో చేరాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సగటున ఏడాదికి 52 రోజుల పని కల్పించలేని వాళ్లు 125 రోజుల పని ఇస్తాం అంటే నమ్మేందుకు ప్రజలు వెర్రివాళ్ళు కాదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కావాలని బీజేపీ చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చేసిన పనికి వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదన్నారు. 100 రోజులు పని కల్పించాలని చట్టం చెప్తే, 50 రోజులు కూడా ఇవ్వలేక పోయారన్నారు. ఉపాధి హామీ పని కల్పన దగ్గర మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా పోయిందన్నారు.