కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన క‌రువు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కావాల‌ని ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌న్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువు అని మండి ప‌డ్డారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌ను ఇచ్చి మోసం చేసిన ఘ‌న‌త సీఎం రేవంత్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. ఒకప్పుడు హోరెత్తిన ఈ ‘బాహుబలి’ పంపులను చూడండి. ఇవి కె.సి.ఆర్ నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ పంపింగ్ స్టేషన్‌కు చెందిన 145 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇంత భారీ నీటి పారుదల పంపులు మరెక్కడా లేవు అన్నారు కేటీఆర్.

ఈ ఏడాది జూలై 29న కృష్ణా నదిలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు రావడం మొదలైందని,, కానీ, రేవంత్ ప్రభుత్వం 76 రోజుల పాటు కుంభకర్ణుడిలా నిద్ర పోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముందస్తు ప్లాన్ అంటూ లేకుండా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇవాళ క‌రువు వ‌చ్చింద‌న్నారు. ఇది తెచ్చి పెట్టుకున్న క‌రువు త‌ప్ప ఎల్ నినో క‌రువు కానే కాద‌న్నారు కేటీఆర్. ఓ వైపు విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక నానా తంటాలు ప‌డుతుంటే డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ స్పందించిన పాపాన పోలేద‌న్నారు. ఇప్ప‌టికే స‌ర్కార్ చేతులెత్తేస్తే ఇక రాబోయే ఎండాకాలం మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కోక త‌ప్ప‌ద‌న్నారు. ఇక‌నైనా సీఎం మొద్దు నిద్ర వీడాల‌న్నారు.

బి.ఆర్.ఎస్ నాయకులు పదేపదే ఈ మోటార్లను ఆన్ చేయాలని డిమాండ్ చేసిన తర్వాతే, ప్రభుత్వం కళ్లు తెరిచి ఇటీవల నార్లాపూర్ పంపింగ్ స్టేషన్‌లో నీటిని ఎత్తి పోయడం ప్రారంభించిందని అన్నారు కేటీఆర్. ఈ సీజన్‌లో వరదలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు నీటిని ఎత్తిపోసి ఉంటే, సుమారు 40 టీఎంసీల (TMC) నీటిని తరలించే అవకాశం ఉండేద‌న్నారు మాజీ మంత్రి. దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!