తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలధారిగా శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు అభయమిచ్చారు . రాత్రి 6.30 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం ప్రసాదించారు. గజరాజుల గంభీర నడక, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోషల నడుమ సాగిన గరుడ సేవ భక్తులను పరవశింపజే సింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రాన్ని మార్మోగించారు.
మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. చిరుజల్లులను సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు.గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, బాదంపాలు, అల్పాహారం, బిస్కెట్ ప్యాకెట్లు అందించింది. వర్షంలోనూ అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. వైష్ణవ సంప్రదాయంలో గరుడ వాహన సేవకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. భగవంతునికి పరమ భక్తుడైన గరుడాళ్వారిపై స్వామి వారు విహరించడం భక్తి, శరణాగతికి ప్రతీకగా నిలుస్తుంది. గరుడుని దర్శనం సర్వపాప ప్రక్షాళనకు, జ్ఞాన వైరాగ్య ప్రాప్తికి మార్గమని పురాణాలు తెలియ జేస్తున్నాయి. గరుడ వాహనంపై కొలువు దీరిన శ్రీవారిని దర్శించు కోవడం తమ జన్మ ధన్యమైనట్లుగా భక్తులు భావిస్తారు.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జానకీదేవి, రంగశ్రీ, శ్రీ దివాకర్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, పూర్ణ సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, ఆనంద్ సాయి, నరేష్ కుమార్, శాంతారామ్, జేఈవోలు డా. ఎ. శరత్, ప్రభల గోపినాథ్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
