Gopichand Thotakura: అంతరిక్షం యానం చేయనున్న తెలుగు తేజం !
అంతరిక్షం యానం చేయనున్న తెలుగు తేజం !
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే భారత తొలి పర్యాటకుడిగా తెలుగు తేజం గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో ఆయన కొద్దివారాల్లో రోదసిలోకి వెళ్లనున్నారు. అందువల్ల రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లే రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. అంతేకాదు పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేయనున్నారు. తద్వారా భారత తొలి స్పేస్ టూరిస్టుగా గుర్తింపు పొందనున్నారు.
Gopichand Thotakura Viral
బ్లూ ఆరిజిన్ సంస్థ ఇప్పటికే న్యూ షెపర్డ్ సబ్ ఆర్బిటల్ వ్యోమనౌక ద్వారా అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ సహా ముగ్గురు పర్యాటకులు రోదసియాత్ర చేశారు. తదుపరి చేపట్టబోయే ఎన్ఎస్-25 మిషన్‌కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ వీరిలో ఉన్నారు.
విజయవాడలో పుట్టిన గోపీచంద్ తోటకూర… అట్లాంటా శివారులోని ‘ప్రిజర్వ్ లైఫ్’ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇది లక్షల డాలర్లతో ఏర్పాటైన వెల్నెస్ సెంటర్. గోపీచంద్(Gopichand Thotakura) పైలట్ గానూ శిక్షణ పొందారు. పదేళ్ల క్రితం ఆయన భారత్ లో… వాయు మార్గంలో రోగుల అత్యవసర తరలింపు విభాగంలో సేవలు అందించారు. బ్లూ ఆరిజిన్ అధికారికంగా ప్రకటించే వరకూ తన కుటుంబానికి సైతం తన రోదసియాత్ర విషయం తెలియదని గోపీచంద్ పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే అంతరిక్షంపై తనకు ఆసక్తి కలిగిందని తెలిపారు. ఆయన ‘ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ’ నుంచి ఏరోనాటికల్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు.
100 కిలోమీటర్ల ఎత్తుకు..
బ్లూ ఆరిజిన్ ఇప్పటి వరకు ఆరు మిషన్లలో 31 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీరంతా సముద్రమట్టానికి 80-100 కిలోమీటర్ల ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్లారు. మొత్తం 11 నిమిషాల పాటు ఈ యాత్ర సాగుతుంది. ధ్వని కన్నా మూడు రెట్ల వేగంతో వ్యోమనౌక ప్రయాణిస్తుంది. అందులోనివారు కార్మాన్ రేఖను దాటి కొద్దిసేపు భారరహిత స్థితిని అనుభవిస్తారు. అక్కడి నుంచి భూగోళాన్ని వీక్షించి మెల్లగా కిందకు వస్తూ పారాచూట్ల సాయంతో క్యాప్సూల్‌లో కిందకు దిగుతారు.గోపీచంద్(Gopichand Thotakura) అంతరిక్షయాత్రకు సంబంధించిన ఖర్చును వేరేవాళ్లు భరిస్తున్నారు. అది ఎవరు, ఎంత మొత్తం చెల్లిస్తున్నారనేది బ్లూ ఆరిజిన్ బహిర్గతం చేయలేదు.
భారత్‌కు చెందిన రాకేశ్ శర్మ… 1984లో అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేశారు. వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్‌పోర్టు ఉంది.
మొత్తం ఆరుగురు
Also Read : Saudi Arabia: ఖైదీని విడిపించేందుకు రూ. 34 కోట్లు విరాళాలు !