MLC Kavitha: 15 వరకు సీబీఐ కస్టడీలో కవిత !

15 వరకు సీబీఐ కస్టడీలో కవిత !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముందుగానే చెల్లించి… తర్వాత ఆ డబ్బు కోసం అరబిందో గ్రూప్‌ నకు చెందిన శరత్‌చంద్రారెడ్డిపై ఒత్తిడి చేసినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో గురువారం తీహార్ జైల్లో కవితను(MLC Kavitha) అరెస్ట్‌ చేసిన సీబీఐ అధికారులు శుక్రవారం ఉదయం ఆమెను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి 5 రోజుల కస్టడీ కోరారు.

MLC Kavitha in CBI Custody

‘‘కవితను 2022 డిసెంబరు 11న హైదరాబాద్‌లో విచారించాం. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాల ఆధారంగా ఆమెను మరింత సమగ్రంగా విచారించాల్సి ఉంది. పలువురి వాంగ్మూలాల ప్రకారం ఈకేసులో ప్రధాన కుట్రదారుల్లో ఆమె కూడా ఒకరని తేలింది. న్యాయస్థానం ఇచ్చిన అనుమతి మేరకు 6వ తేదీన తిహార్ జైల్లో విచారించాం. ఆమె సమాధానాలు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలకు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలి’’ అని సీబీఐ అధికారులు న్యాయమూర్తిని కోరారు.

కవిత(MLC Kavitha) అరెస్ట్‌ అన్యాయం… రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌధరి వాదనలు వివరించారు. ‘‘కవితకు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నసాక్ష్యాధారాలు ఏడాది కాలానికి ముందువి. ఆ అంశాలపై ఇప్పుడు అరెస్ట్‌ చేసి ప్రశ్నించాలని చెప్పడంలో అర్థం లేదు. ఆ సాక్ష్యాలకు, ప్రస్తుత అరెస్ట్‌ కు ఎలాంటి సంబంధంలేదు. గతంలో అరెస్ట్‌ చేయడానికి సుముఖత చూపని సీబీఐ ఇప్పుడు అరెస్ట్‌ చేయడానికి కారణం లోక్‌సభ ఎన్నికలే. ప్రజాభిమానం ఉన్న నాయకురాలి కస్టడీని పొడిగించడం కోసం ఇప్పుడు అరెస్ట్‌ చేశారు. పార్టీలో కీలకంగా ఉన్న ఆమెను జైల్లోనే ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల సమయం ఆమెకు చాలా కీలకం. అరెస్ట్‌ విషయంలో సీబీఐ నిబంధనలు పాటించలేదు. ఇలా చేయడం అధికార దుర్వినియోగం కిందికి వస్తుంది’’ అని న్యాయమూర్తికి వివరించారు.

‘‘ఇప్పటివరకు దర్యాప్తు సంస్థ సేకరించిన మెటీరియల్‌… దర్యాప్తు అధికారి సమర్పించిన కేస్‌ డైరీ… ఆరోపిత కుట్రలో పలువురు నిందితుల పాత్ర… నేరం చేసిన విధానం… దాని తీరును చూసిన తర్వాత నిందితురాలిని సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో కుట్రను పూర్తిగా వెలికితీయడానికి ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను, సాక్షులను నిందితురాలి ముందుంచి విచారించాల్సిన అవసరం గురించి దర్యాప్తు సంస్థ చెప్పింది. అందువల్ల ఆమెను ఈనెల 15వరకు సీబీఐ కస్టడీకిస్తున్నాం. సీబీఐ విజ్ఞప్తిని తోసిపుచ్చాలని కోరుతూ నిందితురాలు దాఖలుచేసిన దరఖాస్తును డిస్మిస్‌ చేస్తున్నా’’ అని న్యాయమూర్తి కావేరి బవేజా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘కస్టడీలో ఉన్న కవితను(MLC Kavitha) ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అడ్వొకేట్‌ మోహిత్‌ రావుతో అరగంట పాటు మాట్లాడటానికి అనుమతివ్వాలి. వారి మాటలను సీబీఐ అధికారులు వినకూడదు. అదే సమయంలో సోదరుడు కేటీఆర్‌, భర్త అనిల్‌, పీఏ శరత్‌ తో 15 నిమిషాల పాటు మాట్లాడటానికి వీలు కల్పించాలి. నిందితురాలిని ప్రశ్నించే సమయంలో ఏదో ఒకచోట సీసీటీవీ ఏర్పాటుచేసి, దాని ఫుటేజీని భద్రతపరచాలి’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Also Read : Gopichand Thotakura: అంతరిక్షం యానం చేయనున్న తెలుగు తేజం !

Leave A Reply

Your Email Id will not be published!