CM YS Jagan: ఏపీ సీఎం జగన్ కు హైకోర్టు నోటీసులు !
ఏపీ సీఎం జగన్ కు హైకోర్టు నోటీసులు !
CM YS Jagan: రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించేలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వివిధ మార్గాల్లో ప్రకటనల రూపంలో వృధా చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హై కోర్టు తీవ్రంగా స్పందించింది. వైసీపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం 2019 జూన్ నుంచి ప్రకటనలకు కోట్లు ఖర్చు చేసిందని… ఇలాంటి చర్య సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమంటూ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో పిల్ (పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్) దాఖలు చేశారు.
CM YS Jagan Got High Court Notices
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్ రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం… ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, కాగ్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగతి పబ్లికేషన్స్ ఎండీ, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ఎండీ, విశాఖలోని సీబీఐ ఎస్పీ, ఢిల్లీలోని సీసీఆర్జీఏ (ప్రభుత్వ ప్రకటనల్లో కంటెంట్ రెగ్యులేషన్ కమిటీ) కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan) నేతృత్వంలోని అధికార వైసీపీ పార్టీ… ప్రకటనల రూపంలో ప్రజాధనాన్ని తన స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం… తన స్వంత, అనుకూల మీడియా సంస్థలకు దోచిపెడుతున్నారంటూ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. ప్రజాధనం దుర్వినియోగం, ప్రకటనల జారీలో కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. జగతి పబ్లికేషన్స్ కు ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని విన్నవించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి వైకాపా(YCP) ప్రయోజనాలను ప్రోత్సహించేలా, గత ప్రభుత్వాన్ని కించపరిచేలా ప్రకటనలు ఇచ్చిందన్నారు. ఆ ప్రకటనలు ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేవిగా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan) వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచేవిగా ఉన్నాయన్నారు. వైసీపీను ప్రోత్సహించేలా, గత ప్రభుత్వాన్ని కించపరిచేలా… జారీ చేస్తున్న ప్రకటనలను వ్యక్తిగత ప్రకటనలుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్మను వైసీపీ నుండి వసూలు చేయాలని ఆయన ఆ పిల్ లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం… వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ… పిల్ దాఖలు చేయడంలో దురుద్దేశం ఉందన్నారు. 2019 తర్వాత ఇచ్చిన ప్రకటనల గురించి మాత్రమే పిటిషనర్ ప్రస్తావించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. దీనితో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం… ఇకపై ఇవ్వబోయే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read : Volunteers Awards: వలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం !