అమరావతి : మడ అడవుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణకే కాకుండా, మానవ మనుగడకు కూడా అత్యంత కీలకమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నాగబాబు స్పష్టం చేశారు. ఒకప్పుడు పొయ్యిలో కట్టెల కోసం మడ అడవులను విచ్చలవిడిగా నరికివేసి, సహజంగా ఏర్పడిన విలువైన వృక్ష సంపదను నాశనం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రసాదించిన సంపదను కాపాడు కోవాల్సింది పోయి, దానిని ధ్వంసం చేయడం ద్వారా మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నామన్నారు. మడ అడవులను సంరక్షిస్తే అవి భవిష్యత్తులో మనకు గొప్ప జీవనాధారంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సంఘమేశ్వరంలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. 100 హెక్టార్ల విస్తీర్ణంలో మూడు లక్షల మడ మొక్కలను నాటే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో స్వయంగా మొక్కలు నాటి, మడ అడవుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడారు.
కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చెట్లను నరికి వేయాలంటే అనేక ఆంక్షలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలోనూ వృక్ష సంపద పరిరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో కొన్ని లోపాలు ఉన్నాయని అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు త్వరలోనే వాల్టా చట్టాన్ని మరింత క్రియాశీలంగా అమలు చేస్తామని ప్రకటించారు. .ఒక్కో మొక్క పర్యావరణానికి అందించే ప్రయోజనాలు వెలకట్టలేనివి. అయినప్పటికీ, మన చుట్టూ ఉన్న చెట్లను, విలువైన మడ అడవులను నరికివేస్తూ ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నా పట్టించుకోక పోవడం ఆందోళనకరం అని అన్నారు నాగబాబు. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, వృక్ష సంపదను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం చెట్లను కాపాడితే.. అవే మనల్ని కాపాడతాయి. ప్రకృతిని పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు.
ఇల్లు నచ్చకపోతే మరో ఇంటికి మారవచ్చు.. ఊరు నచ్చకపోతే మరో ఊరికి వెళ్లవచ్చు.. దేశం నచ్చక పోతే మరో దేశానికి వెళ్లిపోవచ్చు. కానీ భూమి నివాసయోగ్యంగా లేకపోతే మనం ఎక్కడికి వెళ్లగలం? అని ప్రశ్నించారు. భూమి మనుగడకు అనుకూలంగా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవడం ఒక్కటే మార్గం అన్నారు. పర్యావరణ కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన చెందారు. హైదరాబాద్లో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతూ, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతోందని అన్నారు నాగబాబు. అదే విధంగా గోదావరి జిల్లాల్లో నీటి కాలుష్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని హెచ్చరించారు.
