తాడేపల్లి గూడెం : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి మరోమారు పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక, సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కోవడంపై పార్టీకి చెందిన రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్లతో చర్చించారు. జిల్లాల వారీగా ఈ సమావేశాలు జరిగాయి. సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ అబ్జర్వర్లతో వైఎస్ జగన్ ముఖాముఖి చర్చలు జరిపారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలను ఎదుర్కోవడంపై ఆయన వారికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చ జరిగింది.
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన, అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇంకా రెండున్నరేళ్లగా రాష్ట్రంలో సాగుతున్న దుర్మార్గపాలన, వాటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రతిపాదిత అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నోడ్యూ సర్టిఫికెట్ విషయంలో అధికారులతో అక్రమాలు చేయిస్తున్నారన్నారు. విశాఖ పట్నంలో శశికళ అనే తాజా మాజీ కార్పొరేటర్ ఎస్సీ కులస్తురాలు అయితే, ఆమెకు ఓసీ కాపుగా సర్టిఫికెట్ ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు. దీనిపై పోరాడి పరిష్కారం దక్కించుకునే లోగా ఎన్నికల సమయం ముగుస్తుందని, చంద్రబాబు ఇలాంటి తప్పుడు విధానాలను అనుసరిస్తున్నాడని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు జగన్ రెడ్డి. అన్ని అంశాలపై రీజినల్ కో-ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు స్పందించాలని కోరారు.
అసెంబ్లీ అబ్జర్వర్లు, పార్లమెంటు అబ్జర్వర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు జగన్ రెడ్డి. అధికారాన్ని అడ్డుపె ట్టుకుని చంద్రబాబు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలని, వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకు రావాలని, లీగల్ టీంను అప్రమత్తం చేసి కోర్టుల ద్వారా వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా విషయాన్ని వెంటనే ఎన్నికల కమిషన్తో పాటు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని నిర్దేశించారు. వైయస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండోవర్లు పేరిట పోలీసులు వేధింపులకు దిగుతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించ బోమన్నారు జగన్ రెడ్డి . నిబంధనలకు విరుద్ధంగా, చట్టాన్ని ధిక్కరిస్తూ వ్యవహరించే వారిపై న్యాయ పోరాటం తప్పదనే సందేశం ఇవ్వాలన్నారు. పార్టీ పట్ల అత్యంత విశ్వసనీయత, విధేయత ఉన్న వారికి అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్దేశించారు.
