హైదరాబాద్ : వేసవి కాలం ఆరంభమైందని, నిప్పు రగిల్తే పెను ముప్పు తప్పదని, ఇలాంటి తరుణంలో అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. బాచుపల్లి ప్రధాన రహదారిలో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఫర్నీచర్ దుకాణాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్టు సర్క్యూట్ జరిగి నిప్పు రవ్వలు రాలాయని.. అవి ఫర్నీచర్ దుకాణాలకు అంటుకుని మంటలు వ్యాపించాయని అక్కడి షాపుల నిర్వాహకులు తెలిపారు. పైన కరెంటు తీగలు వెళ్తున్నాయని.. అందులో ఒక తీగ తెగి మంటలు అంటుకున్నాయని మరో దుకాణ నిర్వాహకుడు చెప్పాడు.
అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండే అవకాశాలపై అవగాహన ఉండడం.. వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవడం అందరూ అలవర్చుకోవాలని హైడ్రా కమిషనర్ సూచించారు. తనిఖీలు చేసినంత మాత్రాన అగ్ని ప్రమాదాలను నియంత్రించలేమని.. ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అందరూ పాటించినప్పుడే ఫలితాలుంటాయని చెప్పారు. ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఒక్క ప్రమాదంతో బూడిదౌతున్నాయనే విషయం గ్రహించాలని అన్నారు. ఇక్కడ కూడా ఒక్కో దుకాణంలో రూ. 25 లక్షలకు పైగా ఫర్నీచర్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు… ఇది తీరని నష్టమని హైడ్రా కమిషనర్ చెప్పారు. 22 షాపులకు పైగా బూడిదయ్యాయి. నష్టపరిహారం రెవెన్యూ విభాగం చూస్తుందని.. ప్రమాదాలు మున్ముందు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తనిఖీలతో పాటు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పట్టించుకోని వారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా హైడ్రాకు కట్టపెట్టాలని ప్రభుత్వానికి నివేదించామని ఈ సందర్భంగా తెలిపారు.
