Jagan Bus Yatra : జగన్ బస్సు యాత్ర ‘మేమంతా సిద్ధం’ కు సర్వం సిద్ధం !
జగన్ బస్సు యాత్ర ‘మేమంతా సిద్ధం’ కు సర్వం సిద్ధం !
Jagan Bus Yatra: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ‘మేమంతా సిద్ధం’ కు సర్వం సిద్ధమైంది. ప్రొద్దుటూరు కేంద్రంగా బుధవారం ప్రారంభం కానున్న ఈ బస్సు యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం సాయంత్రం జరగనున్న ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహణ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఉన్న తిమ్మయ్య కల్యాణ మండపం ఎదురుగా సభను నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేస్తున్నారు.
Jagan Bus Yatra Updates
బస్సు యాత్రకు సంబంధించి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. “మార్చి 27 బుధవారం ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. వైసీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి(AP CM YS Jagan) ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తారు. అనంతరం 1.30 గంటలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి(AP CM YS Jagan) ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి,సర్వరాజుపేట,వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల,నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్,చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు” అని తెలిపారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రొద్దుటూరులో జరగనున్న తొలి ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. ఇందు కోసం అన్ని జాగ్రత్తలు, చర్యలు చేపట్టారు. ఎమ్మె ల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి.
Also Read : Budi Mutyala Naidu: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ !