K Viswanath Comment : కన్నీళ్లను మిగిల్చిన కళాతపస్వి
లోకాన్ని వీడిన విశ్వనాథుడు
K Viswanath Comment : కాశీనాథుని విశ్వనాథ్ ఇక లేడు. ఇక రాడు. సినిమాను ప్రేమించి..దానినే శ్వాసగా మార్చుకుని ముందుకు సాగిన ఆయన ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌండ్ రికార్డిస్ట్ గా కెరీర్ ప్రారంభించి..సహాయ దర్శకుడిగా..పూర్తి స్థాయి డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
తీసినవి కొన్ని సినిమాలు కావచ్చు..కానీ ప్రతి సినిమా ఓ క్లాసిక్..ఓ పుస్తకం. ఎలాంటి హంగులు ఆర్భాటాలు..భేషజాలు లేకుండానే కమర్షియల్ సినిమా దూకుడులో సైతం కళాత్మక సినిమాలకు ఆదరణ ఉంటుందని నిరూపించిన దర్శక ధీరుడు కె.విశ్వనాథ్(K Viswanath) .
ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు, సన్మానాలు ఆయనను వరించాయి. కానీ ఏనాడూ వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ తుది శ్వాస విడిచేంత వరకు కూడా తనను తాను పరిశీలించుకుంటూ ఉన్నారు.
తన జీవిత కాలంలో 92 ఏళ్లు బతికారు. రాజుగానే ఉన్నారు. మహ రాజు లాగే వెళ్లి పోయారు. జీవితాన్ని,సమాజాన్ని ప్రతిఫలించేలా ఉండేలా చూశారు. ఎలాంటి స్టార్లు అక్కర్లేకుండానే సినిమాను సక్సెస్ చేసిన ఘనత కూడా కె. విశ్వనాథ్ దే. శంకరా భరణం దేశాన్ని విస్తు పోయేలా చేసింది. చర్చించేలా మార్చేసిన ప్రతిభ కళాతపస్విది.
లోక నాయకుడు కమల్ హాసన్ , జయప్రదతో తీసిన సాగర సంగమం గురించి ఎంత చెప్పినా తక్కువే. నరుడి బతుక్కి గురించి , ఓ కళాకారుడి ఆవేదన, ప్రేమ, అనుబంధం, మనుషుల మధ్య ఉండే బంధాల గురించి సున్నితంగా తెరపై ఎక్కించిన తీరు ప్రశంసనీయం.
ఆయన హృదయం సంగీతం..మనస్సు సాహిత్యం..జీవితం అంతా సినిమానే గడిచింది..అలా పలరించేలా చేశారు కూడా. సిరి సిరి మువ్వలా పలకరించారు. స్వర్ణ కమలమై అల్లుకు పోయారు. సిరి వెన్నెలను అందించారు కే. విశ్వనాథ్. ఆయనలోని అభిరుచిని గుర్తించిన వారు ఏడిద నాగేశ్వర్ రావు.
అందుకేనేమో ఎలాంటి శబ్దాలు, రణ గొణ ధ్వనులు లేకుండా హాయిగా..ఇంటిల్లిపాది పాడుకునేలా ..చూసేలా చేశారు. ఎక్కడో ఉన్న సీతారామ శాస్త్రిని తీసుకు వచ్చి అద్భుతమైన పాటలు రాశేలా చేశారు. పట్టు పట్టి సిరివెన్నెలనే ఇంటి పేరుగా మార్చేలా చేసిన మహానుభావుడు కళాతపస్వి.
ఆ తర్వాత వెనక్కి తీసుకోలేదు. ఎవరి సపోర్ట్ లేకుండానే హీరోగా మారిన చిరంజీవికి అద్దం పట్టేలా స్వయం కృషి తీశాడు. ఆపై ఆపద్భాంధవుడుతో అలరించారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయనకు సాహిత్యం, సంగీతం అంటే వల్లమాలిన అభిమానం.
అదే అద్భుతాలు చేసేలా చేసింది. కళా ఖండాలు అనదగేలా చిత్రాలు రూపొందించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు కళాతపస్వి. ఆయన ఎంపిక చేసుకున్న వారిలో దిగ్గజాలు ఉన్నారు.
సంగీత దర్శకులు కేవీ మహదేవన్ , ఇళయరాజా, వేటూరి సుందర రామ్మూర్తి, ఎస్పీ బాలసుబ్రమణ్యం , సిరివెన్నెల సీతారామ శాస్త్రి తో రాయించారు.
ప్రతి సినిమాలో ఎలాంటి అసభ్యత లేకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు కే. విశ్వనాథ్. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన వారు ఎందరో ఉన్నా కళాతపస్వి మాత్రం చిరస్మరణీయంగా నిలిచి పోతారు.ఆయన చూపిన మార్గం ఎందరికో మార్గదర్శకంగా మారింది..మరెందరో దర్శకులకు పాఠంగా మిగలనుంది.
దర్శక ధీరుడు రాజమౌళి చెప్పినట్లు ప్రపంచంలో తెలుగు సినిమా గొప్పదనం ఏమిటంటే ఒక్కటి మాత్రం చెప్పగలం..మా కాశీనాథుని విశ్వనాథ్(K Viswanath) చేతిలో రూపుదిద్దుకున్న సినిమాలని.
ఏది ఏమైనా కళాతపస్వి మనందరినీ కంటతడి పెట్టించేలా చేశాడు..కన్నీళ్లు కురిపించేలా మార్చేశాడు. ఎక్కడున్నా ఆయన ఆత్మ పదిలంగా ఉండాలి.. ఆ దేవుడు చల్లగా చూడాలి.
Also Read : కళాతపస్వి సినిమాలు కళాఖండాలు