KCR: ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్ !

ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్ !

KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనగామ జిల్లా ధారవత్‌ తండాలో పంట నష్ట పరిహారం ఇప్పించాలని ఈ సందర్భంగా అన్నదాతలు కేసీఆర్ ను కోరారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్ మాట్లాడుతూ… ‘పంటలు ఎండిపోయాయని… ధైర్యం కోల్పోవద్దు. పోరాడి… మన నీళ్లను మనం సాధించుకుందాం. 24 గంటల కరెంటు, రైతు రుణమాఫీ, రైతు బంధును పోరాడి తెచ్చుకుందాం’ అని అన్నదాతలకు భరోసా ఇచ్చారు.

KCR Visit…

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి బస్సులో బయలుదేరిన కేసీఆర్‌ మధ్యాహ్నం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌ తండాకు చేరుకున్నారు. ఎండిన పంట పొలాలను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. రైతులు తమ సమస్యలను విన్నవించారు. రూ. 60 వేల పెట్టుబడి పెట్టి మూడెకరాల్లో సాగు చేసిన వరిపంట చివరి దశలో నీరందకపోవడంతో… రూ.80 వేల ఖర్చుతో రెండు బోర్లు వేయించినా నీరు పడలేదని, అప్పులు మిగిలాయని మహిళా రైతు జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.

బంజరకు చెందిన దివ్యాంగ రైతు మాలోతు లక్ష్మణ్‌ కేసీఆర్‌(KCR) కాళ్లపై పడి తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘మూడెకరాల్లో వరిసాగు చేశాను. బావి, రెండు బోర్లు ఉన్నా.. నీళ్లు లేకపోవడంతో రూ. 65 వేలతో రెండు బోర్లు వేసినా నీరు పడలేదు. పంట ఎండిపోయింది’ అని వాపోయారు. చింతబావి తండాకు చెందిన ధన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. గతంలో కాలువల ద్వారా నీళ్లొచ్చేవని, ఈసారి నీళ్లు రాక నాట్లు పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, సూర్యాపేట మండలం ఎల్కారంలో పంటలను పరిశీలించారు. ఐదెకరాల్లో పంట నష్టం జరిగిందని దంపతులు కొదంగుండ్ల వెంకటయ్య, సరోజన ఆయనకు తెలిపారు. కేసీఆర్‌ వెంట ఎంపీలు మాలోత్‌ కవిత, బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ మంత్రులు దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, నల్గొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామా మల్లేశం, పలువురు నేతలు ఉన్నారు.

జనగామ జిల్లా ధరావత్‌ తండాలో కేసీఆర్‌కు(KCR) మహిళా రైతు సత్తెమ్మ తన గోడు విన్నవించారు. ఎనిమిదెకరాల్లో వరి సాగు చేస్తే మొదట్లోనే రెండెకరాలు ఎండిపోయాయని, మిగిలిన ఆరెకరాలను కాపాడుకునేందుకు రూ. 1.60 లక్షలతో బోర్లు వేయించానని తెలిపారు. ఒక్కదాంట్లోనూ చుక్కనీరు రాలేదని విలపించారు. పంట చేతికొస్తుందని ఆశించి కుమారుడి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నామంటూ పెళ్లి కార్డును కేసీఆర్‌ కు ఇచ్చారు. పెళ్లి చేయడానికి డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి దయాకర్‌రావును కేసీఆర్‌ పిలిచి… ఆమె కుమారుడి పెళ్లికి పార్టీ తరఫున రూ.5 లక్షలు ఇద్దామని, పూర్తి వివరాలు తీసుకోవాలని సూచించారు.

Also Read : CM YS Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసులొ సీబీఐకి సుప్రీం సూటి ప్రశ్న !

Leave A Reply

Your Email Id will not be published!