Kisan Garjana : కేంద్రంపై యుద్దం కిసాన్ గర్జనకు సిద్దం
28న నాగ్ పూర్ లో మహా మోర్చా
Kisan Garjana : ఓ వైపు వ్యవసాయ రంగం కుదేలవుతోంది. రోజు రోజుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం వ్యాపారవేత్తలు, బడా బాబులు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఏ విపక్ష పార్టీలకు చెందిన రైతులు అనుకుంటే పొరపాటు పడినట్లే .
భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న రైతు, కార్మిక సంఘాలు(Kisan Garjana) యుద్దం ప్రకటించాయి. ఇది మోదీకి ఒక రకంగా షాక్ అని చెప్పక తప్పదు. ఇప్పటికే రైతుల మహా ఆందోళన దెబ్బకు తీసుకు వచ్చిన సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకున్నారు ప్రధాని. ఆపై బిల్లును రద్దు చేశారు.
ఈ తరుణంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థలుగా పేరొందిన భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) , భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్ ) సంయుక్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 19న దేశ రాజధాని ఢిల్లీలో కిసాన్ గర్జన పేరుతో భారీ ఆందోళన చేపట్టనున్నట్లు బీకేఎస్, బీఎంఎస్ వెల్లడించాయి.
అంతే కాకుండా మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో ఈనెల 28న మహా మోర్చా చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అన్నం పండించే రైతులకు భరోసా లేకుండా పోయిందని ఆరోపించాయి. పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదని మండిపడ్డాయి. కిసాన్ సమ్మాన్ నిధి కింద అందజేస్తున్న పంట సాయం పెంచాలని డిమాండ్ చేశాయి బీకేఎస్, బీఎంఎస్.
దీంతోనైనా ప్రభుత్వంలో కదలిక వస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
Also Read : ‘పల్లె’కు పట్టం వసుధైక కుటుంబం