విద్యుత్ సమస్య పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్
ప్రజలు సహకరించాలని కోరిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వడగాలులు, అకాల వర్షం, గాలి వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య ఎక్కడ తలెత్తినా పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తున్నాం అని ప్రకటించారు. వాతావరణ మార్పుల వల్ల పలు చోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. రాష్ట్రంలో అక్కడక్కడా తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. 48 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు, సాయంత్రం ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ఎక్కడైనా ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్దరిoచటానికి కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతుందని చెప్పారు గొట్టిపాటి రవికుమార్.అధిక ఉష్ణోగ్రతలోనూ ప్రాణాలు ఫణంగా పెట్టి విద్యుత్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి పని చేస్తున్నారని స్పష్టం చేశారు.సత్తెనపల్లి లో ఇద్దరు సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారని వాపోయారు.
ప్రజలు వాస్తవాలు అర్ధం చేసుకోవాలని సూచించారు. ఈదురు గాలులకు హోర్డింగ్ లు విద్యుత్ తీగల మీద పడి కూడా సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అనుమతులు లేని హోర్డింగ్ లు తొలగించేందుకు మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాం అని తెలిపారు గొట్టిపాటి రవికుమార్.
టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం అని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందన్నారు. గత 5ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క విద్యుత్ సబ్ స్టేషన్ ను కూడా నిర్మించ లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టిందన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు వల్ల ట్రాన్స్మిషన్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.