కల్పవృక్ష వాహనంపై కోనేటిరాయుడి దివ్య దర్శనం
వాంఛిత ఫలాల ప్రసాదకుడై భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి
తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి వైభవంగా సాగిన వాహన సేవలో గజరాజులు ముందుండగా, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, గోవింద నామ స్మరణల నడుమ మాడ వీధులు ఆధ్యాత్మిక కాంతులతో కళకళ లాడాయి. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు. ప్రకృతికి ప్రాణాధారమైన వృక్షాలలో కల్పవృక్షం అత్యున్నతమైనదిగా పురాణాలు వర్ణిస్తాయి. సముద్ర మథనంలో ఆవిర్భవించిన ఈ దేవతా వృక్షం భక్తుల వాంఛిత ఫలాలను ప్రసాదించేదిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన కోనేటి రాయుడు భక్తుల కోరికలను తీర్చే దేవదేవుడిగా దర్శనమిచ్చి భక్తజనులను పరవశింప జేశారు.
ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం చేసి వేదమంత్రోచ్చారణల నడుమ విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజ స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. . “రాజా ప్రజారంజనాత్” అన్న సూక్తికి అనుగుణంగా ప్రజలను రక్షించి ధర్మాన్ని స్థాపించేవారే నిజమైన పాలకులని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు సందేశమిస్తారు. కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వలోకాల అధిపతిగా సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారని ఆగమ శాస్త్రాలు పేర్కొంటాయి.
