Minister Uttam Kumar Reddy: బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఎదుట స్వయంగా హాజరవుతా – మంత్రి ఉత్తమ్‌

బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఎదుట స్వయంగా హాజరవుతా - మంత్రి ఉత్తమ్‌

Uttam Kumar Reddy : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడంపై మరికొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయింది. దీనితో ఈ నెల 15వ తేదీనుండి విచారణకు రానున్న గోదావరి, కృష్ణా జలాల వివాదంపై తెలంగాణా భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)… సీనియర్ న్యాయవాదులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా, ఏపీతో వివాదాలపై సుప్రీంకోర్టులో వినిపించాల్సిన వాదనలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో న్యాయ బృందానికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. అంతేకాదు బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఎదుట స్వయంగా హాజరవుతానని ఆయన చెప్పారు.

Uttam Kumar Reddy Attend

కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ గత నెలలో మూడు రోజుల పాటు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు కేటాయించినా, ఏపీకి నష్టమేమీ ఉండదని బ్రిజేష్ కుమార్‌ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ స్పష్టం చేశారు. ఏపీ బేసిన్‌ బయట ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏ మేరకు మళ్లిస్తోందని ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ప్రశ్నించగా… ఉమ్మడి రాష్ట్రంలో అంతర్గత ఏర్పాటు ద్వారా 512 టీఎంసీలను ఏపీ వినియోగించుకుంటోందని వైద్యనాథన్‌ వివరించారు.

ఇందులో ఇతర బేసిన్‌ లకు 323 టీఎంసీలను మళ్లిస్తోందని, కృష్ణా బేసిన్‌ లో 189 టీఎంసీలను మాత్రమే వినియోగిస్తోందని తెలిపారు. ఢిల్లీలో జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ అధ్యక్షతన జస్టిస్‌ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ ఎస్‌.తాళపత్ర సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్‌ ఎదుట తన వాదనలు కొనసాగించారు. తదుపరి విచారణను ఏప్రిల్‌ 15-17కు ట్రిబ్యునల్‌ వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున తుది వాదనలను వినగా, మిగతా వాదనలను ఏప్రిల్‌ 15 నుంచి చేపట్టే విచారణలో వింటామని ట్రిబ్యునల్‌ పేర్కొంది.

Also Read : Bhadrachalam: భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌

Leave A Reply

Your Email Id will not be published!