హైదరాబాద్ : ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కి సంబంధించిన తేదీల పై ముఖ్యమంత్రి తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో పని చేస్తోందన్నారు. ప్రస్తుతం వేస్తున్న పునాదులు రాబోయే తరాలకు ఆధునిక తెలంగాణ నిర్మాణానికి నాంది పలుకుతాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” ఏర్పాటు చేసినట్లు తెలిపారు.