Mudragada Padmanabham: వైసీపీలో చేరిన ముద్రగడ ! కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్ !
వైసీపీలో చేరిన ముద్రగడ ! కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్ !
Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా… సీఎం వైఎస్ జగన్… ముద్రగడ పద్మనాభంను ఆలింగనం చేసుకుని పార్టీ కండువా కప్పి… పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ముద్రగడ వెంట మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ మాట్లాడుతూ… కాపుల అభ్యున్నతి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని… వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు.
Mudragada Padmanabham Join in…
1978లో జనతాపార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham)… 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు.. 1999 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్ సభ స్థానం నుండి గెలుపొందారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ముద్రగడ… కాపు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెద్ధ ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తుని రైలు దహనం కేసులో కేసులను ఎదుర్కొన్నారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ముద్రగడ కుటుంబాన్ని తీవ్ర అవమానాలు, ఇబ్బందులకు గురిచేసిందంటూ అనేక సార్లు మీడియా ముఖంగా, బహిరంగ లేఖల ద్వారా వెల్లడించారు.
అయితే ఇటీవల కాలంలో జనసేనకు చెందిన పలువరు కాపు సామాజిక వర్గం నేతలు ముద్రగడను కలిసి జనసేనలోనికి ఆహ్వానించారు. ముద్రగడతో భేటీ అనంతరం… పవన్ కళ్యాణ్ సమక్షంలో పద్మనాభం పార్టీలో చేరుతారంటూ జనసేన నేతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా జిల్లాకు వచ్చి ముద్రగడను పార్టీలోనికి ఆహ్వానిస్తారు అని ప్రకటించారు. అయితే టీడీపీతో పొత్తులో భాగంగా విడుదల చేసిన మొదటి జాబితాలో జనసేనకు కేవలం 24 సీట్లు కేటాయించడంపై ముద్రగడ… మరోసారి తన బహిరంగ లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వైసీపీకు చెందిన ముఖ్య నేతలు ముద్రగడ నివాసానికి వెళ్ళి పార్టీలోనికి ఆహ్వానించారు. దీనితో ఈ నెల 14న కిర్లంపూడి నుండి ర్యాలీగా బయలుదేరి తాడేపల్లిలో సీఎం సమక్షంలో వైసీపీలో చేరుతానని ముద్రగడ ప్రకటించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ర్యాలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని… తాను సింగిల్ గా సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరుతానని ప్రకటించారు.
Also Read : TSRTC News : కొత్తగా 3035 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్న టీఎస్ఆర్టీసీ