Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ డేటా విషయంలో SBI పై సుప్రీం కోర్టు ఆగ్రహం !

ఎలక్టోరల్ బాండ్స్ డేటా విషయంలో SBI పై సుప్రీం కోర్టు ఆగ్రహం !

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఎలక్టోరల్ బాండ్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ పై సీజేఐ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను ఎస్‌బీఐ తమకు సమర్పించలేదని ఈసీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీనితో బ్యాంకుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘బాండ్ల నంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారన్నది స్పష్టంగా తెలియడం లేదు. అన్ని వివరాలను వెల్లడించాలని మేం తీర్పులోనే పేర్కొన్నా… మీరు ఎందుకు ఇవ్వలేదు’’ అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఎస్‌బీఐ కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోగా తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్‌బీఐని ఆదేశించింది. అంతేకాదు ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించిన అన్ని వివరాలను సోమవారం నాటికి ఈసీకి అందజేయాలని స్పష్టం చేసింది.

Electoral Bonds – సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు కోరిన ఈసీ !

ఎలక్టోరల్ బాండ్స్ పై మార్చి 11న ఇచ్చిన తీర్పును కొంత సవరించాలని కోరుతూ ఎన్నికల సంఘం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. 2019 ఏప్రిల్‌ 12వ తేదీకి ముందు జారీ అయిన బాండ్లు, వాటిని ఎన్‌ క్యాష్‌ చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలను సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈసీ గతంలో రెండు సార్లు సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కోర్టుకు ఆశ్రయించింది. ‘‘గోప్యతను పాటించేందుకు నాటి బాండ్ల డాక్యుమెంట్లను మేం సీల్డ్‌ కవర్‌లో సమర్పించాం. వాటికి సంబంధించి ఇప్పుడు మా వద్ద ఎలాంటి కాపీలు లేవు. వాటిని తిరిగి ఇవ్వండి’’ అని అభ్యర్థించింది. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. గతంలో ఈసీ ఇచ్చిన వివరాలను స్కాన్‌ చేసి డిజిటలైజ్‌ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ తరువాత ఒరిజినల్‌ డాక్యుమెంట్లను ఈసీకి ఇవ్వాలని సూచించింది. వాటిని శనివారం సాయంత్రం 5 గంటల్లో వెబ్‌ సైట్‌ లో బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

Also Read : Mudragada Padmanabham: వైసీపీలో చేరిన ముద్రగడ ! కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్‌ !

Leave A Reply

Your Email Id will not be published!