కోల్ కతా : సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ను, ప్రధాని మోదీ, ఆయన పరివారాన్ని ఏకి పారేశారు. ప్రస్తుతం ఈ దేశంలో ఒక్క బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని, ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. భారతదేశంలో బీజేపీ దాడిని దీదీ మాత్రమే ఎదుర్కోగలరని, ఆమెకు మాత్రమే ఆ సత్తా ఉందన్నారు అఖిలేష్ యాదవ్.
నిరంతరం కుట్రలకు తెరతీస్తూ విష ప్రచారాన్ని చేస్తూ వస్తున్న బీజేపీ దాడులను తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు మాజీ సీఎం. ఇదే క్రమంలో బీజేపీ దాడులను ఎదుర్కోవడంలో ఆమె చూపిన ధైర్యానికి టీఎంసీ అధినేత్రిని ప్రశంసించారు. అఖిలేష్ యాదవ్ తన భార్య , లోక్‌సభ ఎంపీ డింపుల్ యాదవ్‌తో కలిసి, ఇక్కడి రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో బెనర్జీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనుభవాన్ని ప్రస్తావించారు. అక్కడ ముసాయిదా జాబితాల నుండి దాదాపు 2.89 కోట్ల మంది ఓటర్లను తొలగించారని ఆయన ఆరోపించారు. బెనర్జీతో యాదవ్ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో తాము మమతా బెనర్జీకి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
