అమరావతి : వచ్చే ఏడాది జూన్ నెలలో మొదలయ్యే గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదులలో కాలుష్య నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టడం కోసం అత్యున్నత స్థాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.
రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు పర్యటించిన పవన్ కళ్యాణ్ స్వయంగా పడవపై ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగు నీరు నేరుగా పవిత్రమైన గోదావరి నదిలో కలవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు తాము మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావనతో వెళ్లకూడదు. ప్రతి ఒక్కరికీ పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.