పోల‌వ‌రం నిర్మాణం ప‌నులు బాగున్నాయి

అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు

పోలవరం : పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చాలా బాగున్నాయంటూ కితాబు ఇచ్చారు. డ్యామ్‌లోని గ్యాప్‌-2 ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో మట్టి తేమ శాతం, గట్టిదనాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ప్రాజెక్టులో వివిధ నిర్మాణ పనులను పరిశీలిస్తూ, సమీక్షల్లో పాల్గొంటున్న అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్‌ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్‌ హించ్‌బెర్గర్‌, డేవిడ్‌ పాల్ 9 గంటలకు ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్‌ వోహ్రా, సభ్య కార్యదర్శి ఎం. రఘురాం తదితరులతో కలిసి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించారు.

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌లో ఇప్పటివరకు చేపట్టిన మట్టి, రాయి, ఇసుక పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ప్రతినిధులు నిపుణులకు వివరించారు. ప్రధానంగా మట్టి తేమ శాతం, కుదింపు తర్వాత దాని గట్టిదనం ఏ మేరకు ఉందన్న అంశాలపై నిపుణులు దృష్టి సారించారు. వారి సూచనల మేరకు నిర్మాణ సంస్థ సిబ్బంది రెండు ప్రాంతాల్లో నిర్దేశిత కొలతలతో పెద్ద గుంతలు (పిట్స్‌) తవ్వారు. వాటిలోకి దిగిన నిపుణులు మట్టిని స్వయంగా పరిశీలించారు. పీపీఏ సీఈవో సంజీవ్‌ వోహ్రా సైతం పలుగు, పార పట్టుకుని మట్టిని తవ్వి పరీక్షల్లో పాల్గొన్నారు. పరిశీలనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిపుణులు స్వయంగా నమోదు చేసుకున్నారు.

నిర్దేశించిన మేరకు మట్టిలో తేమ శాతం ఉండటంతోపాటు, అవసరమైన గట్టిదనం కూడా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన మట్టి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇట్స్‌ వెరీ గుడ్‌.. గోయింగ్‌ ఆన్‌ వెరీ వెల్‌ అంటూ ప్రశంసించారు . ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో షీప్‌ ఫుట్‌ రోలర్‌ను తిప్పించి మట్టి ఏ మేరకు గట్టిపడుతోందో నిపుణులు పరిశీలించారు. గొర్రె పాదాల ఆకారంలో ఉండే రోలర్ తో మట్టిని కుదించే ప్రక్రియను గమనించారు. పరీక్షల కోసం తవ్విన గుంతలను తిరిగి మట్టితో పూడ్చాలని సూచించారు. వాటిని పూడ్చిన అనంతరం షీప్‌ ఫుట్‌ రోలర్‌తో కుదింపు ప్రక్రియ చేపట్టి, మట్టి గట్టిదనాన్ని మరోసారి పరీక్షించనున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!