ఒడిశా : అటు ఉత్తరాన్ని ఇటు దక్షిణాది ప్రాంతాలను కలిపే గొప్ప సాంస్కృతిక చైతన్యం కలిగిన నగరం ఒడిశాకు ఉందని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. బుధవారం భువనేశ్వర్‌లో జరిగిన ఉత్కల్ యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ వ్యవస్థాపక దినోత్సవానికి ఒడిశా గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటితో కలిసి హాజరు అయ్యారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు ప్రసంగించారు. అధ్యయనం, పరిశోధన, డాక్యుమెంటేషన్, నిరంతర విద్య ద్వారా గణనీయమైన విజయాన్ని సాధించడం వీలవుతుందన్నారు. తద్వారా మన సాంస్కృతిక విలువల గొప్పతనాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి, ప్రచారం చేయడానికి , రక్షించడానికి ఈ విశ్వవిద్యాలయం స్థాపించ బడిందని తెలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ విశ్వ విద్యాలయం మొత్తం దేశంలోనే ఈ రకమైన మొదటిది కావడం మనందరికీ, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు చాలా గర్వకారణం అని అన్నారు.
ఒడిశా గొప్ప సాంస్కృతిక సంప్రదాయం, గొప్ప వారసత్వానికి నిలయం అన్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఇది భారతదేశ సాంస్కృతిక పటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిందని అన్నారు. పురాతన ఒడిశా సంస్కృతుల సంగమంగా పేరు పొందిందని చెప్పారు. భౌగోళికంగా, ఒడిశా ఉత్తరాన్ని దక్షిణంతో కలిపే సంస్కృతి కారిడార్‌ను అందిస్తుందన్నారు. శతాబ్దాలుగా ఒడిశా భారతీయ సంస్కృతి ప్రధాన స్రవంతిలో తన సాంస్కృతిక గుర్తింపును నిలుపుకుందని అన్నారు. అంతే కాదు విభిన్నమైన కళాత్మక విజయాలకు నిలయంగా ఉందన్నారు. ఒడిశా యుగయుగాలుగా నిలిచే కళ తో విరాజిల్లుతున్న సాంస్కృతిక సంప్రదాయాలకు కేరాఫ్ గా నిలిచందన్నారు.
