Russia Ukraine War : బలం ఉన్నోడిదే రాజ్యం. అధికారం ఉన్నోడిదే అందలం. ఇందుకేనా మనం ఏర్పాటు చేసుకున్నది ఈ దేశాలను. ఎక్కడికి పోతోంది ఈ ప్రపంచం.
ఆధిపత్య ధోరణి కారణంగా యావత్ ప్రపంచంలోని కోట్లాది ప్రజల సమూహం ఉద్విగ్నతకు లోనవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
టెక్నాలజీ పెరిగింది. కానీ యుద్ద కాంక్షను మాత్రం ఆపలేక పోతున్నాం. ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాలు, ప్రమాణాలు అన్నీ అక్కరకు రాకుండా పోతున్నాయి.
ఈ మారణ హోమం ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేం. ప్రజలు చైతన్యవంతం కానంత దాకా ఇలాగే ఉంటాయి.
ప్రజాస్వామ్యం పరిహాసం అవుతోంది. రాజ్యాధికార కాంక్ష మనుషుల్ని చంపే స్థాయికి చేరుకుంది.
మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం రక్తసిక్తం అని.
కళ్ల ముందు హృదయ విదారక దృశ్యాలు కలిచి వేస్తున్నాయి.
మనుషులే కాదు పక్షులు, జంతు జీవాలు సైతం వీరి ఆధిపత్య పోరులో నలిగి పోతున్నాయి. కాల గర్భంలో కలిసి పోతున్నాయి.
అణుబాంబులతో, మిస్సైళ్లతో యుద్ద కాంక్షతో రగిలి పోతున్న వాళ్లను ఆపే వారు ఎవరున్నారు గనుక.
సైబర్ వార్ పక్కన పెడితే ఏకపక్షంగా దాడులకు దిగుతూ తనను తాను సుప్రీం అనుకుంటోంది రష్యా(Russia Ukraine War).
ఓ వైపు అమెరికా ఇంకో వైపు చైనా మధ్యలో రష్యా ఆధిపత్య పోరాటానికి శ్రీకారం చుట్టాయి.
రష్యా, చైనా రెండూ యుద్ద కాంక్షతో రగులుతున్నాయి. ఇక అమెరికా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్దం జరగాలని కోరుకుంటోంది.
ఎందుకంటే ఆ దేశానికి కావాల్సింది తాను తయారు చేసిన ఆయుధాలను అమ్ముకోవాలి.
వాటి ద్వారా కాసులు కొల్లగొట్టడమే కాదు ఆయా దేశాల మధ్య దాడులకు ప్రేరేపిస్తూ పబ్బం గడుపుతోంది అమెరికా. అంతేకాదు ఎక్కడ వనరులు ఉంటాయో వాటి మీద కన్నేస్తూ యుద్దానికి ప్రేరేపిస్తోంది.
ఇదే సమయంలో టెక్నాలజీ మరింత వేగవంతం కావడంతో అగ్ర రాజ్యాల ఆధిపత్యానికి తెర పడుతోంది. దీనిని జీర్ణించు కోలేని చైనా,
రష్యా, అమెరికా దాడులకు తెగ పడుతున్నాయి.
ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూ మరో వైపు యుద్దానికి సై అంటున్నాయి. ప్రస్తుతం ఈ దేశాల దుందుడుకు తనాన్ని చూసి ప్రపంచం ఈసడించుకుంటోంది.
వీరి ఆధిపత్య ధోరణికి ఇంకెంత మంది బలి కావాలో వేచి చూసే దౌర్భాగ్యం మనకు దక్కడం బాధాకరం. యుద్దంలో ఎవరో ఒకరు గెలవచ్చు ఇంకొకరు ఓడి పోవచ్చు .
కానీ అభం శుభం తెలియని చిన్నారులు, నడవలేని స్థితిలో ఉన్న వయసు మళ్లిన వారు ఎందుకు రాలి పోవాలి. ఇకనైనా రష్యా మారాలి. వెంటనే ఉక్రెయిన్ పై యుద్దాన్ని (Russia Ukraine War)విరమించు కోవాలి. ప్రపంచానికి కావాల్సింది శాంతి కానీ వార్ కాదని గుర్తు పెట్టుకోవాలి.
Also Read : కదన రంగంలో వెరవని యోధుడు