Wrestllers Tears Comment : రెజ్లర్ల కన్నీళ్లకు విలువే లేదా
కొనసాగుతున్న ఆందోళన
Wrestllers Tears Comment : పవిత్ర భారత దేశంలో మహిళలకు అపారమైన గౌరవం, స్థానం ఉంది. కానీ అదే మహిళలు కన్నీళ్లు పెడితే ఏమను కోవాలి. నిత్యం సంస్కృతి, సంప్రదాయం, నాగరికత అంటూ గగ్గోలు పెట్టే పరివారాలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. వాళ్లు నేరస్థులు కాదు. అంతకన్నా మోసానికి పాల్పడ లేదు. సమున్నత భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు.
అంతే కాదు సమస్త ప్రపంచం గర్వ పడేలా దేశానికి పేరు తీసుకు వచ్చారు. ఆపై అసాధారణ ప్రతిభా పాటవాలతో త్రివర్ణ పతాకాన్ని రెప రెప లాడేలా చేశారు విపణి క్రీడా వేదికపై. విజేతలుగా నిలిచిన వారిని అభినందించేందుకు పోటీ పడ్డారు. సెల్ఫీలు దిగారు. సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టారు. కానీ అదంతా ప్రచారం తప్ప ఆచరణలో కాదని తేలి పోయింది.
వాళ్లు మహిళా మల్ల యోధులు. ఒకరు ఆరోపిస్తే అందులో తేడా ఉందని అనుకోవాలి. కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మందికి పైగా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు. ఆపై ఆవేదన(Wrestllers Tears Comment) చెందారు. చివరకు తమకు రక్షణ లేకుండా పోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదంతా ఎక్కడో కాదు దేశ రాజధాని ఢిల్లీ నడి బొడ్డున. వాళ్లకు భరోసా ఇవ్వాల్సిన కాషాయ ప్రభుత్వం కిమ్మనడం లేదు. ఆపై తుతూ మంత్రంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లకే అనుకూలంగా నివేదిక తయారు చేయడం విస్తు పోయేలా చేసింది.
ఇదేదో సినిమా కథ లాగా ఉందని అనుకుంటే పొరపాటే. సభ్య సమాజం, యావత్ భారతం తల వంచుకునేలా ఇవాళ దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు రోడ్డెక్కారు. తాము అన్యాయానికి, లైంగిక వేధింపులకు గురవుతున్నామని ఆవేదన చెందారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే కేసు నమోదు చేయకుండానే తిప్పి పంపించారు ఢిల్లీ పోలీసులు.
ఇదీ మన పోలీసు వ్యవస్థ. చివరకు భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో దెబ్బకు దిగి వచ్చారు. సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ జోక్యం చేసుకుని, నోటీసు ఇస్తేనే కానీ కేసు నమోదు చేయలేదు. దీని వెనుక ఎవరు ఉన్నారో అర్థం కావడం లేదా.
తాము ఇక తట్టుకోలేమంటూ కన్నీటి పర్యంతమైన రెజ్లర్లు చేసిన ప్రధాన ఆరోపణ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. కేంద్రాన్ని డోంట్ కేర్ అంటున్నారు. ఓ వైపు కోర్టు అంటే తనకు గౌరవం ఉందని అంటూనే మహళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు అబద్దాలంటున్నాడు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆరోపించారు. మన్ కీ బాత్ పేరుతో 100వ ఎపిసోడ్ ఉత్సవాలను నిర్వహించిన కేంద్రం దేశం కోసం ఆడుతున్న మహిళల ఆక్రందనను వినిపించు కోలేక పోయింది.
ఈ దేశంలో కేవలం న్యాయ వ్యవస్థ మాత్రమే సరిగా పని చేస్తోంది. అదీ గనుక లేక పోతే దేశం అరాచకత్వంలోకి వెళ్లి పోతుందనేది వాస్తవం. ఇంతకూ వాళ్లు చేసిన తప్పేంటి. తేల్చకుండానే ఆరోపణలు చేస్తే ఎలా. పీటీ ఉష సైతం నోరు జారడం విస్తు పోయేలా చేసింది. సాటి మహిళలకు భరోసా ఇవ్వాల్సిన ఐఓసీ చైర్మన్ ఇలా మాట్లాడటం ఎంత మాత్రం క్షమార్హం కాదు.
మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ ,స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, సెహ్వాగ్ , మాజీ క్రికెటర్ సిద్దూ , ప్రియాంక గాంధీ, సత్య పాల్ మాలిక్ , సీఎం కేజ్రీవాల్ తదితరులంతా మహిళా రెజ్లర్లకు(Wrestllers Tears Comment) మద్దతు పలికారు. ఇకనైనా వాళ్ల ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఆడబిడ్డల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయాలి.
Also Read : రెజ్లర్ల ఆవేదన సిద్దూ ఆలంబన